హాస్పిటల్ అకౌంట్‌లో 17 లక్షలు దోచేసిన హ్యాకర్స్: మీ సిమ్ కార్డు జర భద్రం

హాస్పిటల్ అకౌంట్‌లో 17 లక్షలు దోచేసిన హ్యాకర్స్: మీ సిమ్ కార్డు జర భద్రం

బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు చెందిన అఫీషియల్ బ్యాంక్ అకౌంట్ నుంచి కొందరు దుండగులు రూ.17 లక్షలు దోచేశారు. చేసింది దొంగ పని అయినా.. దొరల్లా నెట్ బ్యాకింగ్ ద్వారా లాగిన్ అయ్యి డబ్బు కొట్టేశారు. ఆస్పత్రి యాజమాన్యానికి ఏ మాత్రం తెలియనీయకుండా పక్కా ప్లాన్ ప్రకారం ముందుగా ఆ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న ‘సిమ్‌ను స్వాప్’ చేసి పని కానిచ్చేశారు. ఆలస్యంగా మేలుకున్న హాస్పిటల్ సిబ్బంది తమ అఫీషియల్ సిమ్‌ను వేరే ఎవరో వాడుతున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బెంగళూరులోని స్పందన నర్సింగ్ హోమ్ ఈ భారీ ఆన్‌లైన్ బ్యాకింగ్ ఫ్రాడ్ బారినపడి రూ.17 లక్షలు కోల్పోయింది. దీనిపై ఫిబ్రవరి 26న పోలసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 14న ఉన్నట్టుండి ఆస్పత్రి అఫీషియల్ (ఎయిర్‌టెల్) సిమ్ కార్డు పని చేయకుండా పోయింది. ఆవుట్ గోయింగ్, ఇన్ కమింగ్ కాల్స్ రాకపోవడంతో ఎయిర్‌టెల్ కంపెనీని సంప్రదించింది హాస్పిటల్ మేనేజ్‌మెంట్. పదేపదే కస్టమర్ కేర్‌కి ఫోన్ కాల్స్, ఎయిర్ టెల్ ఆఫీసు చుట్టూ తిరిగిన తర్వాత 20వ తేదీన మళ్లీ సిమ్ యాక్టివేట్ అయింది. అయితే సిమ్ పని చేయకుండా పోయిన ఈ గ్యాప్‌లో నేరగాళ్లు వేర్వేరు అకౌంట్లను యాడ్ చేసి వాటికి 12 సార్లుగా మొత్తం 17 లక్షల రూపాయల సొమ్మును ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారని తేలింది. అయితే ఈ పని ఆస్పత్రి బ్యాంకు అకౌంట్ వివరాలు, దానికి లింక్ అయిన ఫోన్ నంబర్ తెలిసిన వాళ్లే చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ నంబర్‌ పోయిందని ఎయిర్‌టెల్‌కు కంప్లైంట్ ఇచ్చి అదే నంబర్‌తో కొత్త సిమ్ తీసుకుని ఈ నేరానికి పాల్పడినట్లు చెబుతున్నారు.

ఇలాంటి నేరాల బారిన పడకుండా మనమేం చేయాలి:

  • ఈ భారీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఫ్రాడ్ తర్వాత ఈ తరహా మోసాలు ఎలా జరుగుతున్నాయన్నదానిపై అవగాహన పెంచుకుని, వాటి నుంచి మనల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
  • ఇతరహా స్కామ్స్ చేసేవాళ్లు ముందే మన బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకునే ఉంటారు. అయితే ఆన్‌లైన్‌లో మన అకౌంట్ నుంచి డబ్బు కొట్టేయాలంటే ఓటీపీ తప్పనిసరి. దీనికి రెండు రకాల మోసాలకు పాల్పడుతుంటారు నేరగాళ్లు.
  • మొదటి పద్ధతి చాలా మంది వినే ఉంటారు. మీకు ఫోన్ చేసి భారీ అమౌంట్ లాటరీ తగిలిందనో.. లేదా మీ ఫోన్‌కు భారీ మొత్తంలో రీచార్జ్ చేస్తున్నామనో చెప్పి నమ్మించి ఓ నంబర్ మెసేజ్ వస్తుందని, దాన్ని తమకు చెప్పాలని అడుగుతారు. ఆ నంబర్ వాళ్లకి చెప్పారో ఇక అంతే సంగతులు. ఓటీపీని నేరుగా మీ ద్వారానే తెలుసుకుని, బ్యాంకు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ లేదా డెబిట్/క్రెడిట్ కార్డు నుంచి ఈజీగా డబ్బసు నొక్కేస్తారు.
  • ఇలా ఎవరైనా ఫోన్ చేసి లాటరీ ఆఫర్ల పేరుతో ఓటీపీలు అడిగినప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పకూడదు. వాళ్ల ఫోన్ కట్ చేసిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇలా మోసం బారిన మరొకరు పడకుండా చూడొచ్చు.
  • పైన చెప్పిన విధానంలో భారీ మొత్తం దోచుకోవడం కష్టం. అందుకే బెంగళూరు హాస్పిటల్ అకౌంట్ నుంచి సొమ్ము దోచుకున్న నేరగాళ్లు మరో తరహా మోసానికి తెరతీశారు. అదే ‘సిమ్ స్వాపింగ్’.
  • బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్‌ను తెలుసుకుని అదే నంబర్‌ను మీకు తెలియకుండా వాళ్లు యాక్టివేట్ చేసుకుని దొరల్లా డబ్బు నొక్కేస్తారు.
  • ఈ సిమ్ స్వాపింగ్ కోసం కూడా రకరకాల దారులు ఫాలో అవుతున్నారు సైబర్ నేరగాళ్లు. నేరుగా ఆ నంబర్‌ పోయిందని చెప్పి దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఇచ్చి కొత్త సిమ్ కార్డు తీసుకుంటున్నారు. సేమ్ నంబర్ ఉన్న సిమ్‌ కార్డు హ్యాకర్ల దగ్గర యాక్టివేట్ కాగానే దాని అసలు ఓనర్ చేతిలో ఉన్న సిమ్ పనిచేయకుండా పోతుంది. అయితే ఇలా సిమ్ పోయిందని చెప్పి కొత్త సిమ్ తీసుకునే వాళ్లు దాదాపుగా ఓనర్‌ వివరాలు తెలిసిన వాళ్లే అయ్యుంటారు.
  • అసలు ఓనర్ ఆధార్ కార్డు లాంటి వివరాలు తెలియకుండానే సిమ్ స్వాపింగ్ చేసే హ్యాకర్లు కూడా ఉంటారు. వీళ్లు టెలికామ్ కంపెనీ కస్టమర్ కేర్ అని చెప్పి కాల్ చేసి.. నెట్ స్పీడ్ పెంచుతామనో.. లేదా కాల్ డ్రాప్ ప్రాబ్లమ్ లేకుండా చేస్తామనో చెప్పి సిమ్ వెనుక ఉండే 20 అంకెల యూనిక్ నంబర్ అడుగుతారు. దీని సాయంతో మీరు వాడుతున్న అదే కంపెనీ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి స్విమ్ స్వాప్ రిక్వెస్ట్ పెడతారు నేరగాళ్లు. తన అవసరం కోసం సిమ్ స్వాప్ చేసుకుంటున్నట్లు చెబుతాడు. అప్పుడు దాని అసలు ఓనర్‌కి ఓ కన్ఫర్మేషన్ కాల్ వెళ్తుంది. ఇది తెలిసిన హ్యాకర్ ముందుగానే కాల్ వస్తుందని, అప్పుడు 1 నొక్కాలని చెబుతాడు. అలా ఓనర్ కన్ఫామ్ చేయగానే సిమ్ స్వాప్ అయిపోతుంది. ఓనర్ చేతిలోని సిమ్ డీ యాక్టివేట్ అయిపోయి.. నేరగాళ్ల చేతిలో సిమ్ పని చేయడం స్టార్ట్ అవుతుంది.
  • ఈ సిమ్ స్వాప్ లాంటి మోసాల బారిన పడకుండా సామాన్యులు జాగ్రత్త వహించాలి. ఇలా ఎవరైనా కస్టమర్ కేర్ అని ఫోన్ చేస్తే అసలు ఆ కాల్ ఎందుకొచ్చింది? ఎవరు చేశారు? అన్న వివరాలను జాగ్రత్తగా తెలుసుకోవాలి. వాళ్లు కన్ఫర్మేషన్ అడుగుతోంది దేనికోసమన్నది గుర్తించి ఓకే చేయాలి. లేకుంటే మోసగాళ్ల ఉచ్చిలో చిక్కి.. డబ్బు కోల్పోయే పరిస్థితి వస్తుంది.