వరద సాయానికి రూ.2వేల కోట్లు కేటాయించాలె: తమ్మినేని వీరభద్రం

వరద సాయానికి రూ.2వేల కోట్లు కేటాయించాలె: తమ్మినేని వీరభద్రం
  • కేబినెట్ ప్రకటించిన 500 కోట్లు సరిపోవు
  • సీఎంకు సీపీఎం నేత తమ్మినేని విజ్ఞప్తి 


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వరద బాధితుల సాయానికి రూ.2వేల కోట్లు కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. వరద బాధితులను ఆదుకోవడానికి కేబినెట్ ప్రకటించిన రూ.500 కోట్లు ఏ మాత్రం సరిపోవని తెలిపారు. బుధవారం ఆయన సీఎం కేసీఆర్​కు లెటర్ రాశారు. వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో సీపీఎం బృందాలు పర్యటించాయని తమ్మినేని తన లేఖలో వివరించారు. చాలా ప్రాంతాల్లో పేదల గుడిసెలు నీటిలో మునిగిపోయాయని చెప్పారు. ఇండ్లల్లోని నిత్యవసర వస్తువులన్నీ కొట్టుకుపోయాయని తెలిపారు. 

భద్రకాళి చెరువుకు తూము లేకపోవడంతో కట్ట తెగిందని, ఆ చెరువుకు గేట్లు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ 2020లోనే హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయినా ఇప్పటికీ గేట్ల ఏర్పాటు హామీ నెరవేర్చలేదన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టంపై అంచనా వేయాలని కోరారు. వరి పంటకు ఎకరాకు రూ.20వేలు, వాణిజ్య పంటలకు రూ.40వేల పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదనంగా భూమి లెవలింగ్​కు ఎకరాకు రూ.50వేలు అందించాలని లేఖలో ప్రస్తావించారు. చనిపోయిన వారి కుటుంబానికి రూ.25లక్షల చొప్పున ఇచ్చి ఆదుకోవాలని సీఎంను తమ్మినేని కోరారు.