తాడిచెర్ల బొగ్గు గనిలో 20 వేల కోట్ల కుంభకోణం

తాడిచెర్ల బొగ్గు గనిలో 20 వేల కోట్ల కుంభకోణం
  • స్కామ్ లో అందులో కేసీఆర్ కుటుంబానికి వాటా 
  • గనిని ప్రైవేట్ సంస్థకు ఎందుకు అప్పగించారు ?
  • కోల్ ఇండియా కంటే ఎక్కువ రేటు ఎందుకిస్తున్నారు ?
  • అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి
  • బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/కాటారం/ మంచిర్యాల, వెలుగు: తాడిచెర్ల బొగ్గు గనిలో రూ.20 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, ఇందులో సీఎం కేసీఆర్ కుటుంబానికి వాటా ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్​వెంకటస్వామి ఆరోపించారు. ఈ గనిని సింగరేణి ఎందుకు తీసుకోలేదు?, ప్రైవేట్ సంస్థ ఏఎమ్మాఆర్ కు ఎందుకు అప్పగించారు? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడినంక సీఎం కేసీఆరే మైన్​ను ఏఎమ్మార్ కు అప్పగించారని, దీంతో స్థానికులకు ఉద్యోగాలు దక్కకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
శనివారం జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి జిల్లా కాటారం, మహదేవపూర్ మండల కేంద్రాల్లో జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశాల్లో వివేక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా 2 చోట్లా మీడియాతో మాట్లాడారు. తాడిచెర్లలో ఒక టన్ను బొగ్గు వెలికితీస్తే కంపెనీకి రూ.3,200 చెల్లిస్తున్నారని, కోల్ ఇండియాలోనూ ఇంత రేటు లేదని వివేక్ అన్నారు. కేసీఆర్ ఎక్కువ రేటు చెల్లిస్తూ ప్రజల సొమ్మును ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టుతున్నారని మండిపడ్డారు. సర్కార్ తన నిజాయితీ నిరూపించుకోవాలంటే, తాడిచెర్లలో బొగ్గు వెలికితీతపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ మైన్​ను సింగరేణికి కేటాయించాలని.. అప్పుడే నిర్వాసితులకు, స్థానికులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. 
గెలుపే లక్ష్యంగా పని చేద్దాం..  
వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు వివేక్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్​ను ప్రజలు నమ్మట్లేదని.. బీజేపీని కోరుకుంటున్నారని చెప్పారు. మంథని నియోజకవర్గంలో చందుపట్ల సునీల్ రెడ్డి పోటీ చేసి, విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పుకార్లను నమ్మొద్దని సూచించారు. 
వధూవరులకు ఆశీర్వాదం.. 
సిరొంచలోని శ్రీరాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో తోడె రాజశ్వర్ రెడ్డి బిడ్డ పెండ్లికి వివేక్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. సిరొంచ సర్పంచ్ రంగు బాపు ఇంటికి వెళ్లారు. చెన్నూరుకు చెందిన బీజేపీ లీడర్ నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్ లో గాయపడగా, ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. 
రాష్ట్ర రైతులకేదీ సాయం? 
రాష్ట్రంలో వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోని సీఎం కేసీఆర్.. పంజాబ్​లో రైతులు చనిపోతే పరామర్శకు వెళ్లడం సిగ్గుచేటని వివేక్ విమర్శించారు. రాష్ట్ర రైతులు పంటలు పండక అప్పుల పాలై ప్రాణాలు తీసుకుంటున్నా, వాళ్ల కుటుంబాలను ఆదుకోవట్లేదని మండిపడ్డారు. అడగకపోయినా పంజాబ్ రైతు కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున సాయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 
‘‘రాష్ట్ర సొమ్ము తన అయ్య జాగీరు అన్నట్లుగా కేసీఆర్‌‌‌‌ ‌‌‌‌పంజాబ్‌‌‌‌ ‌‌‌‌వాళ్లకు పంచుడేంది? రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల కుటుంబానికి పైసా ఇయ్యలే. కొండగట్టు ప్రమాదంలో 62 మంది చనిపోతే పైసా ఇవ్వలేదు. ఇంటర్‌‌‌‌ ‌‌‌‌స్టూడెంట్లు ‌‌‌‌సూసైడ్‌‌‌‌ ‌‌‌‌చేసుకున్నా.. వాళ్ల కుటుంబాలను పరామర్శించలే” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడుకును సీఎం చేయడానికే కేసీఆర్ జాతీయ పర్యటనలు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని, ప్రజల్లో వ్యతిరేకత ఉందని పీకే రిపోర్టు ఇవ్వడంతో కేసీఆర్​కు దిక్కుతోచట్లేదన్నారు. త్వరలోనే టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందన్నారు.