
- గత సర్కార్ ప్రజాధనం దుర్వినియోగం చేసింది
- గవర్నర్కు ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: 2022--–23లో టీఆర్ఎస్ను బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మార్చే క్రమంలో అప్పటి కేసీఆర్ సర్కారు దేశవ్యాప్తంగా యాడ్స్ కోసం రూ.244.17 కోట్లు ఖర్చు పెట్టిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌ఎఫ్‌జీ) అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి ఆరోపించారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, మలయాళం, తమిళం, మరాఠీ, ఒరియా, గుజరాతీ, బెంగాలీ, పంజాబీ భాషల పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని తెలిపారు.
రాజకీయంగా లబ్ధి పొందడానికే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. అటు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అనుమతుల్లేని పనులు, అంచనాల పెంపు తదితర చర్యలతో నాటి బీఆర్ఎస్ సర్కారు పెద్ద మొత్తంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపిస్తూ శుక్రవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫిర్యాదు చేశారు. 2023, సెప్టెంబర్‌లో ఎన్నికలకు ముందు నార్లపూర్, కొల్లాపూర్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 2 ప్రారంభోత్సవాలు చేశారని, ఈ సందర్భంగా రూ.22.13 కోట్ల విలువైన యాడ్స్ ఇచ్చారని తెలిపారు. దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.