- రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు
- ట్రైసిటీ చెరువుల అభివృద్ధికి సర్కారు ప్రాధాన్యం
- రూ.120 కోట్లతో టూరిజం హబ్‍గా మారిన భద్రకాళి ఈచెరువు బండ్
- చిన్నవడ్డెపల్లి, ఉర్సు చెరువుల డెవలప్మెంట్కు శంకుస్థాపన
- అమృత్ పథకంలో రూ.06 కోట్ల 28 లక్షల నిధులు కేటాయింపు
వరంగల్, వెలుగు: కాకతీయ రాజుల గొలుసుకట్టు చెరువులకు కేంద్రంగా ఉండే గ్రేటర్ వరంగల్ చెరువులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాణం పోస్తోంది. ఏండ్లతరబడి సరైన పర్యవేక్షణ లేక, చుట్టూ వందలాది కాలనీలు వెలువడంతో మురుగునీరు ఆయా చెరువుల్లోకి చేరి పాడుబడ్డాయి. ఈ క్రమంలో నగరంలోని ఒక్కో చెరువును పూడికతీత చేయించి, ట్యాంక్ బండ్ తరహాలో వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి టూరిజం స్పాట్స్గా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే రెండు ప్రధాన చెరువులు పర్యాటక ప్రదేశాలుగా మారగా, శుక్రవారం సిటీలోని మరో రెండు చెరువుల అభివృద్ధికి అమృత్ పథకంలో శంకుస్థాపన చేపట్టారు.
మురుగునీటితో ముక్కులు పగిలినయ్..
గ్రేటర్ వరంగల్ సిటీలో దాదాపు 10 ప్రధాన చెరువులు ఉండగా, కాజీపేట ఫాతిమానగర్‍లోని వడ్డెపల్లి చెరువు తప్ప మిగతావన్నీ 40 నుంచి 50 ఏండ్లుగా మురుగునీటితో నిండాయి. దీంతో ఈ చెరువుల వద్దకు వెళ్తే ముక్కుమూసుకోవాల్సి వచ్చేది. నగరంలోని బంధం చెరువు, ఉర్సు రంగ సముద్రం, దేశాయిపేట వెళ్లే రోడ్డులో చిన్న వడ్డెపల్లి చెరువు, పెద్దమ్మగడ్డ మీదుగా ఆటోనగర్ వైపు వెళ్లే క్రమంలో హనుమాన్ జంక్షన్ వద్దనున్న కోట చెరువుతో పాటు చివరకు భద్రకాళి చెరువులోకి సైతం మురుగునీటి చేరిక తప్పలేదు.
రూ.240 కోట్లతో భద్రకాళి, వడ్డెపల్లి బండ్స్..
భద్రకాళి చెరువు దాదాపు 380 ఎకరాల్లో ఉండగా భద్రకాళి ఆలయానికి రెండో వైపు చెరువును ఆనుకుని నిర్మించిన భద్రకాళి బండ్ ఇప్పుడు వరంగల్ నగరంలో పర్యాటక కేంద్రంగా మారింది. దాదాపు కిలోమీటర్‍న్నర పచ్చని గార్డెన్, సింథటిక్ వాకింగ్ ట్రాక్, కలర్‍ఫుల్ లైటింగ్, రాతి కట్టడాలతో సాయంత్రవేళ ఆకట్టుకుంటుంది. మొదటి దశలో రూ.84.2 కోట్లతో స్మార్ట్ సిటీ పనులు పూర్తవగా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్థానిక కాకతీయ అర్బన్ డెవలప్‍మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో రూ.35 కోట్లతో రెండోదశ పనులు చేపట్టారు.
భద్రకాళి ఆలయాభివృద్ధిలో భాగంగా దాదాపు రూ.90 కోట్లతో చెరువు మొత్తం పూడికతీతతో పాటు చెరువు మధ్యలో ఐలాండ్స్, బోటింగ్, చెరువు పైభాగంలో గ్లాస్ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. మొదటివిడత పూడికతీత పనులు పూర్తవగా రెండోదశ పనులు నడుస్తున్నాయి. దీంతో భద్రకాళి చెరువుకుఎటువైపు వెళ్లినా పర్యాటక ప్రాంతంగా ఆకట్టుకోనుంది. దీంతోపాటు స్మార్ట్ సిటీ పథకంలో మొదటి దశలో రూ.34.5 కోట్లతో వడ్డెపల్లి చెరువును అభివృద్ధి పనులు చివరి దశకొచ్చాయి.
ఆ రెండు చెరువులు అభివృద్ధి..
నగరంలోని భద్రకాళి బండ్, వడ్డెపల్లి బండ్ పనులు చివరి దశకు చేరాయి. దాదాపు రూ.90కోట్లతో ప్రణాళికలు చేసిన భద్రకాళి ఆలయ చెరువు అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మంత్రి కొండా సురేఖ వరంగల్ ప్రాంతంలోని చిన్నవడ్డెపల్లి, కరీమాబాద్ ఉర్సు రంగసముద్రం చెరువుల సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.
అమృత్ 2.0 పథకంలో ఈ పనుల కోసం రూ.6కోట్ల 28 లక్షల నిధులు కేటాయించారు. దీంతో వరంగల్ ట్రైసిటీ హనుమకొండలో భద్రకాళి చెరువు రూపంలో భద్రకాళి బండ్, వరంగల్ ప్రాంతంలో చిన్న వడ్డెపల్లి, ఉర్సు రంగసముద్రం చెరువులు, కాజీపేట ప్రాంతంలో వడ్డెపల్లి చెరువులతో గ్రేటర్ వరంగల్ నగర చెరువులు పర్యాటక కేంద్రాలుగా ఆకట్టుకోనున్నాయి.
