రిజిస్ట్రేషన్ల బంద్ తో రూ.30 వేల కోట్ల నష్టం

రిజిస్ట్రేషన్ల బంద్ తో రూ.30 వేల కోట్ల నష్టం

 

  • రాష్ట్ర సర్కార్​ తొందరపాటు నిర్ణయంతో అంతా ఆగమాగం
  • 3 నెలలుగా రియల్​ ఎస్టేట్, కన్​స్ట్రక్షన్​ రంగాలకు భారీ దెబ్బ
  • పనులు లేక రోడ్డున పడ్డ 15 లక్షల మంది కార్మికులు
  • తగ్గిన ఇసుక డిమాండ్, నిలిచిన ఇటుక ట్రాన్స్​పోర్ట్​
  • నేడు సీఎం కేసీఆర్​ రివ్యూ.. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకు!

రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఫలితంగా.. ఆర్థిక వ్యవస్థకు మూడు నెలల్లో రూ. 30 వేల కోట్ల నష్టం వాటిల్లింది. లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కరువైంది. డైరెక్ట్​గా రియల్​ ఎస్టేట్, కన్ స్ట్రక్షన్, బ్యాంకింగ్ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇన్​డైరెక్ట్​గా అనేక అనుబంధ రంగాలు దెబ్బతిన్నాయి. సెప్టెంబర్​ 7 న గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను బంద్​ పెట్టింది. ధరణి పోర్టల్ ద్వారానే అన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తామని ప్రకటించింది. అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ధరణి పోర్టల్ ను సీఎం కేసీఆర్ అక్టోబర్​ 29 న ప్రారంభించారు. నవంబర్ 2 నుంచి స్లాట్ బుకింగ్ మొదలైంది. కానీ నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ఈ నెల 14 నుంచి మొదలు పెట్టినా.. ఇంకా గాడిన పడలేదు.

హైదరాబాద్, వెలుగు: రిజిస్ట్రేషన్లు బంద్​ కావడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా  దెబ్బతీసింది. ప్రతి నెలా రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి సగటున రూ. 700 కోట్ల ఆదాయం వచ్చేది. ఈ ఆదాయం పరోక్షంగా వివిధ రంగాల్లో ప్రతి నెల 10 వేల కోట్ల వరకు రొటేషన్ జరిగేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రిజిస్ట్రేషన్లు మూడు నెలలపాటు నిలిచిపోవడంతో ఆర్థిక వ్యవస్థ రూ. 30 వేల కోట్లు  లాస్​ అయిందని అంటున్నాయి. రిజిస్ట్రేషన్ సేవలు ఆగడంతో ఏఏ రంగాలపై ప్రభావం పడింది? ఎంత మేరకు నష్టం వాటిల్లింది? అనే విషయాలపై కీలక ఆఫీసర్లు లెక్కలు తీసినట్టు తెలిసింది. రియల్ ఎస్టేట్, కన్​స్ట్రక్షన్​తో పాటు వాటి అనుబంధ రంగాల్లో ఎలాంటి పరిస్థితి ఉందని, కార్మికులు ఏ పనులు చేస్తున్నారనే దానిపై వారు సమాచారం సేకరిస్తున్నారు.ఇటీవల రిజిస్ట్రేషన్లు ప్రారంభించినా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  141 సబ్ రిజిస్ట్రర్ ఆఫీసుల్లో రోజుకు 24 స్లాట్ల చొప్పున మొత్తం 3,384 రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ రోజుకు మొత్తంగా 100 రిజిస్ట్రేషన్లు కూడా జరగడం లేదు.

లోన్లు ఇచ్చుడు లేక బ్యాంకింగ్​ ఆగమైంది

రాష్ట్రంలో మెజార్టీ హౌస్​ బ్యాంకింగ్ వ్యవస్థ  బిల్డింగ్ సెక్టార్ పై ఆధార పడి ఉంది. 90 శాతం మంది బ్యాంకు లోన్లతోనే ఇండ్లు, ఫ్లాట్స్  కొనుగోలు చేస్తుంటారు. మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు లేకపోవడం  బ్యాంకింగ్ వ్యవస్థపై ఎఫెక్ట్​ చూపింది. ఆస్తి రిజిస్ట్రేషన్ తర్వాతే బ్యాంకులు లోన్ అమౌంట్ ను  విడుదల చేస్తుంటాయి. ఆర్బీఐ గైడ్​లైన్స్​ ప్రకారం శాంక్షన్ చేసిన లోన్ కు 45 రోజుల్లో కస్టమర్లు రిజిస్ట్రేషన్  డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే బ్యాంకులు అమ్మకందారులకు డబ్బును ట్రాన్స్ ఫర్ చేస్తాయి. కానీ మూడు నెలలుగా రిజిస్ట్రేషన్ లేకపోవడంతో లోన్ కోసం మళ్లీ అప్లయ్​ చేసుకోవాలని బ్యాంకులు అంటున్నాయి.

ఇండస్ట్రీలు దెబ్బతిన్నయ్​

నిర్మాణ రంగంలో స్తబ్దత ఏర్పడటంతో 15 లక్షల  మంది కార్మికులకు ఉపాధి కరువైంది. ఐరన్, సిమెంట్ ఇండస్ట్రీలపైనా రిజిస్ట్రేషన్ల బంద్ ఎఫెక్ట్ పడింది. రాష్ట్రంలోని, పొరుగు రాష్ట్రాలకు చెందిన సిమెంట్ పరిశ్రమలు తమ ఉత్పత్తులను తగ్గించినట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని సిమెంట్ కంపెనీలు తమ ఉత్పత్తిలో  మెజార్టీ భాగాన్ని రాష్ట్రంలోని భవన నిర్మాణాలకు సరఫరా చేస్తుంటాయి. రాష్ట్రంలో నిర్మాణ పనులు లేకపోవడంతో స్టీల్ డీలర్లు అమ్మకాలు లేవని చెప్తున్నారు. ఇసుక, ఇటుక రవాణా కూడా నిలిచిపోయింది. రాష్ట్రంలోని ఇసుక క్వారీల నుంచి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగే నిర్మాణ పనులకు ఇసుకను ట్రాన్స్ పోర్టు చేస్తుంటారు. లాక్ డౌన్ తర్వాత టన్ను ఇసుక రూ. 3,500 ధర పలికేది. కానీ ఇప్పుడు రూ. 1,350 ధరకు  కూడా ఎవరు కొనడంలేదని ఇసుక వ్యాపారులు అంటున్నారు.

ఇతర రంగాలపైనా ఎఫెక్ట్​

రిజిస్ట్రేషన్లు లేక ఇండ్లు, అపార్ట్​మెంట్ల నిర్మాణాలు నిలిచిపోవడంతో ఎలక్ట్రికల్ ఇండస్ట్రీపై ప్రభావం పడింది. ఎలక్ట్రీషియన్లు ఉపాధి కోల్పోయ్యారు. ప్లంబర్, కార్పెంటర్, పెయింటర్, ఇంటీరియర్ వర్క్స్ పై ఎఫెక్ట్  చూపింది. ఈ రంగాల్లో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తుంటారు.  కొత్త నిర్మాణాలు జరిగితేనే కార్మికులకు ఉపాధి ఉంటుంది. నిర్మాణాలు పూర్తయిన ఇండ్లు, అపార్ట్ మెంట్ల లోని ఫ్లాట్లకు అమ్మకాలు లేవు. దీంతో కొత్త  నిర్మాణాలను బిల్డర్లు
చేపట్టడం లేదు.

సుప్రీంకు వెళ్లే యోచనలో సర్కార్

నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అనేక అంశాలపై హైకోర్టు అభ్యంతరం చెప్తుండటంతో ఏం చేయాలనే దానిపై శనివారం సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో లీగల్​ ఎక్స్​పర్ట్స్​ సలహాలు తీసుకున్నాక తుది నిర్ణయం తీసుకోనున్నారు. ‘‘కోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లడమా? లేదంటే తగు విధమైన విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా ? అనే అంశంపై రెవెన్యూ, న్యాయ శాఖల నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు’’అని సీఎం ఆఫీసు నుంచి నోట్​ విడుదల చేశారు.

లోన్లు లేవ్​… ట్రాన్సాక్షన్లు లేవ్​

ఇండ్లు, అపార్ట్​మెంట్లలో ఫ్లాట్లు​కొనుక్కోవాలనుకునే వారిలో 90 శాతం మంది బ్యాంక్​ లోన్​ మీదే ఆధారపడుతుంటారు. రిజిస్ట్రేషన్లు లేక బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదు. ఫలితంగా ట్రాన్సాక్షన్లూ తగ్గిపోయాయి.

ఇసుక డిమాండ్​ తగ్గింది

సాధారణంగా హెచ్ ఎండీఏ పరిధిలోనే నిర్మాణాలకు రోజూ
9 వేల లారీల్లో ఇసుక రవాణా జరుగుతుంటుంది. లాక్ డౌన్ తర్వాత టన్ను ఇసుక రూ. 3,500 ధర పలికితే.. ఇప్పుడు 1,350  కూడా పలుకుతలేదు.

స్టీల్, సిమెంట్ ప్రొడక్షన్​ ఆగింది

కన్​స్ట్రక్షన్​ పనులు ఆగిపోవడంతో ఐరన్, సిమెంట్​కు గిరాకీ పడిపోయింది. దీంతో రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల్లోని ఐరన్, సిమెంట్ పరిశ్రమలు కూడా ప్రొడక్షన్​ను తగ్గించుకోవాల్సి వచ్చింది.

ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లకూ పనుల్లేవ్​

ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, పెయింటర్లు, ఇంటీరియర్ వర్కర్స్​పైనా రిజిస్ట్రేషన్ల బంద్​ ఎఫెక్ట్​ పడింది. కన్​స్ట్రక్షన్ వర్క్స్  నడిస్తేనే వీళ్లకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 ఆర్డర్లు రావట్లె.. పేమెంట్లు ఇవ్వట్లె

మూడు నెలలపాటు రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో బిల్డర్లు ఎవరూ మెటీరియల్ ఆర్డర్లు ఇవ్వలేదు. ఈ బిజినెస్ లో ఎక్కువగా ఉద్దెర పద్ధతి నడుస్తుంటుంది. కానీ, రెండు నెలల్లోనే పేమెంట్ క్లియర్ చేస్తుంటారు. అయితే.. రిజిస్ట్రేషన్లు లేక గిరాకీ బందైంది. పాత పేమెంట్స్​ కూడా రాలేదు.

– సోం ప్రకాష్, మెటీరియల్ సప్లయర్

ఇసుకకు డిమాండ్ లేదు

లాక్ డౌన్ తర్వాత టన్ను ఇసుక రూ. 3 వేలకు అమ్మిన. కానీ ప్రస్తుతం రూ. 1,350 కూడా పోవట్లేదు. లారీ ఇసుక తెస్తే ఖర్చులు కూడా రావట్లేదు.  బిల్డర్లు కూడా ఇసుక కావాలని అడగడం లేదు. అన్ లాక్ తర్వాత మార్కెట్ బాగుంటుందని అనుకున్నం. కానీ రిజిస్ట్రేషన్లు లేక కొత్త బిల్డింగ్​లు కట్టడం లేదు.

– శ్రీనివాస్ రెడ్డి, ఇసుక లారీ ఓనర్