మహిళా సంఘాలకు సర్కారు చేయూత .. దాదాపు ఏడేండ్ల తర్వాత వడ్డీ పంపిణీ

మహిళా సంఘాలకు సర్కారు చేయూత .. దాదాపు ఏడేండ్ల తర్వాత వడ్డీ పంపిణీ
  • ఉమ్మడి జిల్లాలో 32 వేల సంఘాలకు రూ.36 కోట్ల లబ్ధి
  • మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఆఫీసర్లు
  • వ్యాపారాలను మరింత విస్తరించే ఆలోచనలో మహిళలు

ఖమ్మం, వెలుగు:  ఇందిరా మహిళా శక్తి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంబురాలు మహిళా సంఘాల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఏండ్ల తరబడి పెండింగ్ లోన్న  ఉన్న వడ్డీని పంపిణీ చేస్తుండడమే దీనికి కారణం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2023–24 సంవత్సరానికి గాను దాదాపు 32 వేల సంఘాలకు రూ.36 కోట్లు వడ్డీని ప్రభుత్వం అందజేస్తోంది. అదే సమయంలో గతంలో తీసుకున్న అప్పులకు వడ్డీ రూపంలో బ్యాంకులకు చెల్లించిన మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి మహిళా సంఘాలకు చెల్లిస్తోంది. వీటివల్ల ఉమ్మడి జిల్లాలో ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉన్న దాదాపు 6 లక్షల మంది మహిళల కుటుంబాలకు లబ్ధి జరుగుతోంది.

 ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 2024 నుంచి సెప్టెంబర్​ 2024 వరకు 19,027 సంఘాలకు గాను రూ.22.90 కోట్ల వడ్డీ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 12,828 సంఘాలకు గాను రూ.12.79 కోట్ల వడ్డీ మంజూరు చేసింది. ఇప్పటికే ఆయా సంఘాలు బ్యాంకులకు వడ్డీ రూపంలో చెల్లించిన మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుండడంతో మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా ఆయా సంఘాలు చేస్తున్న  వ్యాపారాలను మరింత విస్తరించవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇవి కాకుండా ఖమ్మం జిల్లాలో లోన్​ బీమా రూపంలో రూ.2 కోట్లు, ప్రమాద బీమా రూపంలో 14 మందికి రూ.10 లక్షల చొప్పున రూ.1.40 కోట్లు అందజేశారు. 

‘ఇందిరా మహిళా శక్తి’ ఆదుకుంది

అనారోగ్యంతో నా భర్త మృతి చెందాడు. ఇంటి పెద్దదిక్కుని కోల్పోయాం. సొంత ఇల్లు లేదు. ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘ సభ్యుల ఉపాధి కల్పన కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. ఐకేపీ సింగరేణి మండల మహిళా సమాఖ్య ద్వారా కారేపల్లి గ్రామంలో ఇందిరా మహిళా స్త్రీ శక్తి టీ స్టాల్ ను మంజూరు చేశారు. అదేవిధంగా బ్యాంకు లింకేజ్ ద్వారా స్త్రీ శక్తి రుణం తీసుకున్నాను. దాంతో పండ్ల కొట్టు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నాం. ఐకేపీ ద్వారా పొందిన సహాయంతో మా కుటుంబం ఆర్థికంగా బలపడింది. 

గత ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేకుండా రూ.5లక్షల రుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి సంఘానికి రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలను అందజేస్తుంది. సబ్సిడీతో కూడిన రుణాలను కూడా గ్రూప్ సభ్యులకు వ్యక్తిగతంగా అందిస్తుంది. ప్రతీ మండల సమాఖ్యకు రూ.35 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. దీంతో స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయి.   - కంచి నాగలక్ష్మి, స్వయం సహాయక సంఘ సభ్యురాలు, కారేపల్లి

మా గ్రూప్ కి రూ.20 లక్షల రుణం వచ్చింది

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పావల వడ్డీకి రూ.20 లక్షల రుణం వచ్చింది. 2023 నుంచి మేము కట్టిన వడ్డీ మా అకౌంట్ లలో జమ చేశారు. మా గ్రూప్ కి రూ.40 వేల వరకు వచ్చింది. గత ప్రభుత్వంలో గ్రూప్ కి రూ.5 లక్షలు మాత్రమే రుణాలు ఇచ్చారు. రుణంతో పాటు వడ్డీ కూడా వసూలు చేశారు. మాకు మొదటి విడత వడ్డీ ఇప్పటికే అందగా, మళ్లీ రెండవ విడత త్వరలో విడుదల అవుతుందని ఐకేపీ అధికారులు తెలిపారు.

వీరబోయిన రాజకుమారి, డ్వాక్రా మహిళ, ఉప్పలచిలక