గర్భిణి పట్ల అమానుషంగా...

గర్భిణి పట్ల అమానుషంగా...
  • పోలీసుల నిర్వాకంతో ఖైదీకి గర్భస్రావం..
  • 3.83 కోట్ల నష్టపరిహారం

లాస్ ఏంజెలెస్: గర్భిణి.. జైలులో ఖైదీగా ఉన్నది. ఉమ్మ నీరు పోతున్నదని, తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని పోలీసులను కోరింది. కానీ వాళ్లు పట్టించుకోలేదు. అంబులెన్స్‌‌‌‌ను పిలవకుండా రెండు గంటలు ఆలస్యం చేశారు. పైగా ఆస్పత్రికి తీసుకెళ్తూ.. దారిలో స్టార్‌‌‌‌‌‌‌‌బక్స్ కాఫీ షాప్ దగ్గర ఉద్దేశపూర్వకంగా ఆగారు. ఒకవైపు ఆమె బాధపడుతుంటే.. మరింత లేటు చేస్తూ అమానుషంగా ప్రవర్తించారు. చివరికి ఆస్పత్రికి వెళ్లినా.. అప్పటికే నష్టం జరిగిపోయింది. కడుపులోని చిన్నారి దక్కలేదు. గర్భస్రావం అయింది. 2016లో అమెరికాలోని లాస్‌‌‌‌ ఏజెంలెస్ ఆరెంజ్ కౌంటీలో జరిగిన ఘటన ఇది. 

బాధితురాలు శాండ్రా క్యునోనిస్. ‘ప్రొబేషన్ వయెలేషన్’ కింద జైలులో ఉంది. గర్భస్రావం తర్వాత కూడా చాలా రోజులు అదే ఆరెంజ్ కౌంటీ జైలులోనే శాండ్రా శిక్ష ఎదుర్కొన్నది. తనకు జరిగిన నష్టంపై చట్ట ప్రకారం పోరాడిందామె. కానీ మొదటి అడుగులోనే ఎదురుదెబ్బ. 2020 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో ఫెడరల్ కోర్టు ఆమె పిటిషన్‌‌‌‌ను కొట్టిపారేసింది. దీంతో అప్పీలు చేసింది. ఆమె వాదనలు విన్న ఆరెంజ్ కౌంటీ బోర్డు సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్లు.. 4.8 లక్షల డాలర్ల (దాదాపు రూ.3.83 కోట్లు) నష్టపరిహారం చెల్లించేందుకు ఒప్పుకున్నారు. అయితే ఈ సెటిల్‌‌‌‌మెంట్‌‌‌‌కు బాధితురాలు శాండ్రా క్యునోనిస్ ఇంకా అంగీకారం తెలపలేదు. ఆమె ఒప్పుకుంటేనే కేసు ముగుస్తుంది.