తూప్రాన్​ మున్సిపాలిటీలో రూ.4 కోట్ల విలువైన  ప్రభుత్వ భూమి కబ్జా

తూప్రాన్​ మున్సిపాలిటీలో రూ.4 కోట్ల విలువైన  ప్రభుత్వ భూమి కబ్జా

తూప్రాన్, వెలుగు : మెదక్​ జిల్లా తూప్రాన్​ పట్టణంలోని ప్రభుత్వ స్థలంలో హద్దులు తీసేసి మరి కొందరు కబ్జా చేస్తున్నారు. రూ.4కోట్లు విలువ చేసే సుమారు రెండు ఎకరాల భూమి కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. తూప్రాన్  పట్టణంలోని 476 సర్వే నంబర్​లో 25.6 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంది. ఈ సర్వే నంబర్ లో 17.6 ఎకరాలలో గవర్నమెంట్ హాస్పిటల్​తో పాటు, గవర్నమెంట్ కాలేజీ నిర్మించారు. వాటి పక్కనే మరి కొంత స్థలంలో గోడౌన్​ల నిర్మాణం చేపట్టారు. ఇది పోను దాదాపు రెండు ఎకరాల భూమి ఖాళీగా ఉండగా ఆ భూమిని గతంలో కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఏడాదిన్నర కింద తూప్రాన్ ఆర్డీవో శ్యామ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో డివిజన్, మండల  సర్వేయర్లు సర్వే చేశారు. దాదాపు రెండు ఎకరాల వరకు గవర్నమెంట్ భూమి ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూమి ఉందో సూచిస్తూ హద్దులను ఏర్పాటు చేశారు. ఆ తరువాత రెవెన్యూ అధికారులు అటు వైపు చూడకపోవడంతో విలువైన ఆ భూమిపై అక్రమార్కుల కన్నుపడింది. కొందరు వ్యక్తులు  ఈ భూమిని తూప్రాన్ మున్సిపల్ పరిధి హుస్సేన్ పూర్ లోని ఉన్న 22 సర్వే నంబర్ వేసి రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హద్దు రాళ్లను తొలగించారు. చదునుచేసి ప్లాట్లుగా విభజించి అమ్ముతున్నారు. మరి కొందరు ప్రహరీ నిర్మించుకున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా రెవెన్యూ, మున్సిపల్  అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం అక్కడ ఆక్రమణకు గురవుతున్న భూమి విలువ దాదాపు రూ.4 కోట్లకు పై మాటే. ఇప్పటికైనా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి  కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడి ప్రజావసరాలకు వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు.

స్వాధీనం చేసుకుంటాం

ప్రభుత్వ భూమిలో ప్రహారీ నిర్మించి, ప్లాట్లు చేసినవారిపై క్రిమినల్​ చర్యలు తీసుకుంటాం. ఆక్రమణకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. రెవెన్యూ ఆఫీసర్ల తో మరోసారి సర్వే చేయించి హద్దు రాళ్లను గుర్తిస్తాం. గవర్నమెంట్ భూమిని ఆక్రమిస్తే  ఎవరైనా ఉపేక్షించేది లేదు. - సాయిరామ్​, తూప్రాన్ ఇన్​చార్జ్ ఆర్డీవో