డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అవినీతి దందా.. హనుమకొండ సబ్రిజిస్ట్రార్ల ఖాతాల్లోకి రూ.42 లక్షలు బదిలీ

డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అవినీతి దందా.. హనుమకొండ సబ్రిజిస్ట్రార్ల  ఖాతాల్లోకి రూ.42 లక్షలు బదిలీ
  • ఇద్దరు అధికారుల ఇండ్లలో ఏసీబీ సోదాలు
  • 24.61 లక్షల నగదు, 30 లక్షల డిపాజిట్ అమౌంట్ సీజ్
  • బంగారు, వెండి నగలు కూడా..  

హనుమకొండ, వెలుగు : డాక్యుమెంట్ రైటర్లు ఏజెంట్లుగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లోనే అవినీతి దందా కొనసాగుతున్నది. డాక్యుమెంట్ రైటర్ల ఫోన్ పే నుంచి ఇద్దరు అధికారుల ఖాతాల్లోకి ఏకంగా రూ.42 లక్షలు బదిలీ అయ్యాయంటే దందా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఈ బాగోతమంతా గురువారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు హనుమకొండలోని సబ్​రిజిస్ట్రార్​ఆఫీసుతో 
పాటు ఖమ్మంలోని హనుమకొండ ఎస్ఆర్వో-1 జమలాపురం రామనర్సింహరావు, ఎస్ఆర్వో-2 దావులూరి ఆనంద్ ఇండ్లలో జరిగిన ఏసీబీ సోదాల్లో  బయటపడింది.  

  • డాక్యుమెంట్ రైటర్లే మీడియేటర్లు

హనుమకొండ సబ్ రిజిస్ట్రార్-1 జమలాపురం రామనర్సింహరావు, సబ్ రిజిస్ట్రార్-2 దావులూరి ఆనంద్ కొంతకాలంగా డాక్యుమెంట్ రైటర్లను మీడియేటర్లుగా పెట్టుకుని అక్రమార్జనకు తెగబడ్డారు. రిజిస్ట్రేషన్లకు ల్యాండ్ వ్యాల్యూని బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు.  కొనుగోలుదారులు డబ్బులు ఇవ్వకుంటే  దస్తావేజులను ఆఫీసులోనే తొక్కిపెడుతున్నారు. 

వారి ఆగడాలపై ఫిర్యాదు రావడంతో గురువారం మధ్యాహ్నం ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆ టైంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో దాదాపు 20 మంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు.  ఆఫీస్ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా డోర్లు లాక్ చేసి సోదాలు జరిపారు. ఈ క్రమంలోనే 20 మంది డాక్యుమెంట్ రైటర్ల వద్ద 70 అన్ రిజిస్టర్డ్ దస్తావేజులు బయటపడ్డాయి. వాటితో పాటు రూ.47,450 నగదును కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్ఆర్వోల టేబుళ్లపై 204 రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉండడంతో ఏసీబీ ఆధికారులు షాకయ్యారు.  

  • నోట్ల కట్టలు.. ఫిక్స్​డ్​ డిపాజిట్లు 

ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్ రైటర్ల ద్వారానే దందా నడిపిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్లు, డబ్బుల గురించి డాక్యుమెంట్ రైటర్లకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టడం, ఆ తరువాత  ఫోన్ పే ద్వారా తమతో పాటు తమకు తెలిసిన వారి ఖాతాల్లోకి నగదు ట్రాన్స్​ఫర్​చేయించుకున్నట్టు గుర్తించారు. గత ఏడాదికాలంగా  డాక్యుమెంట్ రైటర్ల ద్వారా రూ.42,03,125  వారిద్దరి  ఖాతాల్లోకి వచ్చినట్టు  లెక్క తేల్చారు.  ఫోన్ పే ట్రాన్సాక్షన్లతో పాటు నగదు లావాదేవీలు జరిగాయనే ఆరోపణలున్నాయి. 

ఖమ్మంలోని ఎస్ఆర్వో-2 దావులూరి ఆనంద్ ఇంట్లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాదాపు రూ.24,61,540 నగదు, 819.5 గ్రాముల గోల్డ్, 2.6 కిలోల వెండితో పాటు కపిల్ చిట్స్ లో రూ.30లక్షలకు పైగా  ఫిక్స్ డ్ డిపాజిట్ గుర్తించారు. నగదుతో పాటు దస్తావేజులను సీజ్ చేశారు. ఇదిలాఉంటే, ఎస్ఆర్వో-1 రామనర్సింహరావు ఇంట్లో కేవలం రూ.75 వేల నగదు మాత్రమే పట్టుబడింది. 

సబ్ రిజిస్ట్రార్ల వ్యవహారంపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించి, తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.  హనుమకొండలోని సబ్ రిజిస్ట్రార్‌‌‌‌ ఆఫీసులో తనిఖీల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని మిగతా ఆర్వో ఆఫీసుల్లో కలకలం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల డాక్యుమెంట్ రైటర్ల ద్వారానే దందా నడుస్తుండగా.. వారంతా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.