హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ .. రూ. 5కే బ్రేక్ ఫాస్ట్ క్యాంటిన్లు ప్రారంభం

 హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ .. రూ. 5కే బ్రేక్ ఫాస్ట్ క్యాంటిన్లు  ప్రారంభం
  • మోతీనగర్, మింట్ కాంపౌండ్ వద్ద ప్రారంభించిన మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి
  • తొలిదశలో 60 క్యాంటీన్లలో టిఫిన్స్.. ​దశలవారీగా 150కి పెంపు
  • ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మా లాంటి అల్పాహారాలు..ఒక్కోరోజు ఒక్కో వెరైటీ
  • బస్తీ వాసులు, కూలీలు, చిరు ఉద్యోగులకు ప్రయోజనం

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా రూ.5 కే భోజనం అందిస్తున్న జీహెచ్ఎంసీ.. ఇప్పుడు రూ.5 కే బ్రేక్‌‌‌‌ఫాస్ట్  స్కీమ్‌‌‌‌ను తీసుకొచ్చింది.  సోమవారం మోతీనగర్, మింట్ కాంపౌండ్ వద్ద ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ.5కే  అల్పాహారం అందించే పథకాన్ని జీహెచ్‌‌‌‌ఎంసీ మేయర్​గద్వాల విజయలక్ష్మితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించారు. 

ఈ క్యాంటీన్లలో ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మాలాంటి వివిధ రకాల అల్పాహారాలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం 139 చోట్ల రూ.5 భోజనం అందిస్తుండగా, బ్రేక్ ఫాస్ట్‌‌‌‌ను తొలిదశలో  60 క్యాంటీన్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు.  ఒక్కోరోజు ఒక వెరైటీ టిఫిన్‌‌‌‌ను అందించనున్నారు. వారంలో సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజులకు ఆరు రకాల అల్పాహారాలు అందుబాటులో ఉంచుతారు. 

అలాగే క్యాంటీన్ల సంఖ్యను కూడా దశలవారీగా 150 కి పెంచనున్నారు. ఇది వరకు ఉన్న స్టాల్స్ పూర్తిగా డ్యామేజీ కావడంతో అన్నిచోట్ల  రూ.11.43  కోట్ల వ్యయంతో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కేంద్రంలో  పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పేదలకు పౌష్టికాహారం అందించడమే ధ్యేయంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.  

ప్రస్తుతం ‘హరే రామ హరే కృష్ణ మూవ్‌‌‌‌మెంట్‌‌‌‌’తో కలిసి రూ.5 కే నాణ్యమైన, పౌష్టికమైన భోజనాన్ని అందిస్తున్న జీహెచ్ఎంసీ.. రూ.5 కే టిఫిన్స్ అందించేలా మరోసారి ‘హరే రామ హరే కృష్ణ మూవ్‌‌‌‌మెంట్‌‌‌‌’తో ఒప్పందం చేసుకున్నది. అయితే, పూర్తిగా మిల్లెట్స్‌‌‌‌తో తయారు చేయనున్న ఈ ఒక్కో టిఫిన్ కు రూ.19 ఖర్చవుతుండగా, ఇందులో రూ. 5 ప్రజలనుంచి వసూలు చేస్తుండగా, మిగిలిన రూ. 14ను జీహెచ్ఎంసీ భరించనున్నది. రోజూ 30 వేల మందికి బ్రేక్ ఫాస్ట్ అందించనున్నారు. ఇందుకోసం ఏడాదికి దాదాపు రూ.12 కోట్లను జీహెచ్ఎంసీ ఖర్చు చేయనున్నది.   

ఇందిరమ్మ బాటలో నడుస్తున్నం: మంత్రి పొన్నం

‘గరీబీ హటావో’ అనే నినాదంతో పేదరిక నిర్మూలనకు ఇందిరమ్మ కృషి చేశారని, ఇప్పుడు అదే బాటలో ప్రజా ప్రభుత్వం నడుస్తున్నదని హైదరాబాద్ జిల్లా ఇన్‌‌‌‌చార్జి  మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.  రూ.5కే బ్రేక్‌‌‌‌ఫాస్ట్​స్కీమ్‌‌‌‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.  

ప్రజల ఆశీస్సుల వల్ల ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పారు. ఒక్క హైదరాబాద్ సిటీలోనే 60 వేలకుపైగా రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించామన్నారు. ఇందిరమ్మ స్ఫూర్తితో సీఎం ఆదేశాల మేరకు ఇందిరమ్మ క్యాంటీన్లను  ప్రారంభించామని, ఇప్పటి నుంచి ఇందులో రూ.5కే అల్పాహారం కూడా అందిస్తామన్నారు. 

ప్రభుత్వానికి ఆర్థిక భారం పడుతున్నా పేదలకు నాణ్యమైన ఆహారం తక్కువ ధరకు అందిస్తున్నామని చెప్పారు.  ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పొందేందుకు నగరంలోని ప్రతి మహిళా స్వయం సహాయక సంఘంలో సభ్యత్వం పొందాలని సూచించారు. అందరి సహకారంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌‌‌‌ను పెంచుతున్నామని చెప్పారు. 

అనంతరం మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ... పేదలకు ఇందిరమ్మ క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడుతాయన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్,  జోనల్ కమిషనర్లు బోర్కడే హేమంత్ సహదేవ్ రావు , అనురాగ్ జయంతి, అదనపు కమిషనర్లు రఘుప్రసాద్, పంకజ, తదితరులు పాల్గొన్నారు.