ఇంటి ముందు చెత్త వేస్తే రూ.5 వేల ఫైన్

ఇంటి ముందు చెత్త వేస్తే రూ.5 వేల ఫైన్

ఇంటి ముందు చెత్త వేస్తే రూ. 5 వేల ఫైన్ వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం కాజీపేటలోని మయూరి గార్డెన్స్ లో పట్టణ ప్రగతిపై కార్పొరేటర్లతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ పర్వతగిరిలో చెత్త వేసినందుకు  తన భార్యకు ఫైన్​ వేశారని గుర్తు చేశారు. నగరంలో చెత్త చెదారం వేసేవారికి నోటి మాటతో చెప్తే సరిపోదని, ఫైన్ ​వేస్తేనే వారిలో భయం కలుగుతుందని చెప్పారు. ఇకముందు ఇంటి ముందు చెత్త వేస్తే ఆ ఇంటి యజమానికి రూ. 5 వేల ఫైన్ ​వేయాలని సూచించారు. హన్మకొండ సిటీలో చాలా ఖాళీ ప్లాట్లున్నాయని, వాటిల్లో చెత్తచెదారం, మొక్కలు పెరిగి అపరిశుభ్రతకు దారి తీస్తోందన్నారు. వేకెంట్ ల్యాండ్ ఓనర్లకు నోటీసులు ఇచ్చి ఖాళీ ప్లాట్లలో చెత్త వేయకుండా చూసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ చట్టం పకడ్బందీగా ఉందని, తాను చెప్పినా ఇకపై కలెక్టర్ కూడా వినడని అన్నారు. మన వాడల్ని మనమే బాగు చేసుకోవాలని, ఇంటి నుంచే పరిశుభ్రతకు అడుగు పడాలని సూచించారు. పట్టణ ప్రగతి కింద పట్టణాలకు నెలకు రూ. 70 కోట్లు ఇస్తామని సీఎం కేసీఆర్​ప్రకటించారని, ఆ నిధులతో పట్టణాలను అభివృద్ధి చేసుకుందామని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రభుత్వ చీఫ్​విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.