ఐఎంఎఫ్ఎల్​ డిపో వేలంలో రూ. 60 లక్షలు పలికిన హమాలీ పోస్టు

ఐఎంఎఫ్ఎల్​ డిపో వేలంలో రూ. 60 లక్షలు పలికిన హమాలీ పోస్టు

మెదక్/కొల్చారం, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగం కోసం రూ. లక్షలు ఖర్చయ్యాయనడం తరచూ వింటుంటాం. కానీ మెదక్​జిల్లాలో హమాలీ పోస్టు కోసం ఓ వ్యక్తి రూ.60 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించాడు. మెదక్ జిల్లాలోని వైన్స్ లకు లిక్కర్ సరఫరా చేసే ఐఎంఎఫ్ఎల్ డిపో కొల్చారం మండలం చిన్నఘనపూర్ లో ఉంది. ఇందులో పనిచేసే హమాలీ కార్మికులకు బాగా డిమాండ్ ఉంటుంది. లిక్కర్ కంపెనీల నుంచి వచ్చే లారీల నుంచి కార్టన్ లు అన్ లోడ్ చేసేందుకు, డిపో నుంచి వైన్స్ లకు లిక్కర్ తీసుకెళ్లే లారీలు, ఆటోల్లో లోడ్ చేసినందుకు ఒక్కో హమాలీకి రోజూ రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు లభిస్తుంది. ఇలా ఏవరేజ్ గా నెలకు రూ.80 వేల వరకు వస్తుంది. దీంతో ఇక్కడ హమాలీగా పని చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం ఐఎంఎఫ్ఎల్ డిపోలో 61 మంది కార్మికులు పని చేస్తున్నారు.

హమాలీ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో హమాలీల నియామకం జరుగుతుంటుంది. ఉన్నవారిలో ఎవరైనా చనిపోయినా, లేదా వారంతటవారు వెళ్లిపోయినా ఆ స్థానంలో వేరేవారిని తీసుకుంటారు. ఇక్కడ హమాలీ పోస్టుకు బాగా డిమాండ్ ఏర్పడటంతో కొన్నేళ్లుగా ఖాళీ ఏర్పడినపుడు వేలం పాట నిర్వహించి ఎవరు ఎక్కువ పలికితే వారికి పోస్టు ఇస్తున్నారు. డిపోలో పనిచేసే చిన్నఘనపూర్ గ్రామానికి చెందిన ఓ కూలీ వ్యక్తిగత కారణాలతో హమాలీ పని మానేసి వెళ్లి పోయాడు. అతని స్థానంలో మరొకరిని తీసుకునేందుకు ఆదివారం డిపోలో వేలం పాట నిర్వహించారు. ఇందులో పలువురు పాల్గొనగా చిన్న ఘనపూర్ కు చెందిన ఓ వ్యక్తి రూ.60 లక్షల వరకు పాడి హమాలీ పోస్ట్ దక్కించుకున్నాడు. గతంలో రూ.20 లక్షలు, రూ.39 లక్షలు పలికిన హమాలీ పోస్ట్ ఇప్పుడు ఊహించని విధంగా రూ.60 లక్షలకు పెరగడం చర్చనీయాంశంగా మారింది.