
11 ఏళ్లుగా ఆరుగురు వ్యక్తులు రెండు బావుల నుంచి దొంగతనంగా తోడుకు పోయిన నీటి విలువ ఇది. 2006 నుంచి 2017 మధ్య కాలంలో 6.1 లక్షల ట్యాంకర్ల నీటిని అమ్మి ₹73.19 కోట్లు సొమ్ము చేసుకున్నారని ముంబై పోలీసులు లెక్క తేల్చారు. వారిపై కేసు నమోదు చేశారు.
.ఏంటి.. నీళ్లకు అంత రేటా? అంటే అంతే మరి. ఒకటా.. రెండా.. 11 ఏళ్లుగా ఆరుగురు వ్యక్తులు రెండు బావుల నుంచి నీటిని దొంగతనంగా తోడుకుపోతున్నరు మరి. మరి, పోలీసులు ఊరుకుంటరా? కేసు పెట్టిన్రు. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన్రు. ఆ నీటి లెక్క చెప్పిన్రు. ఈ అరుదైన కేసు ముంబైలోని కల్బదేవి ప్రాంతంలో జరిగింది. బొమాన్జీ మాస్టర్ లేన్‌లోని పాండ్యా మాన్షన్ అపార్ట్‌మెంట్ ముగ్గురు ఓనర్లు, మరో ముగ్గురు వాటర్ ట్యాంకర్ ఆపరేటర్లపై కేసు పెట్టిన్రు. ఈ పదకొండేళ్లలో ఆ ఆరుగురు 6.1 లక్షల ట్యాంకర్ల నీటిని బావుల నుంచి అక్రమంగా తోడుకుని అమ్ముకున్నరు. 10 వేల లీటర్ల కెపాసిటీ ఉండే ఒక్కో ట్యాంకర్‌కు వాళ్లు ₹1,200 వసూలు చేసిన్రు. అంటే ఈ లెక్కన వాళ్లు ₹73.19 కోట్లు సొమ్ము చేసుకున్నరని పోలీసులు అంటున్నరు.
బావులకు అక్రమ కరెంట్ కనెక్షన్‌ను ఇచ్చి మోటార్లతో ఇష్టమొచ్చినట్టు నీళ్లను తోడుకున్నరని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నరు. ట్యాంకర్ ఆపరేటర్లు అరుణ్ మిశ్రా, శ్రవణ్ మిశ్రా, ధీరజ్ మిశ్రాలతో కలిసి పాండ్యా మాన్షన్ ఓనర్లు త్రిపురప్రసాద్ నానాలాల్ పాండ్యా, ప్రకాశ్ పాండ్యా, మనోజ్ పాండ్యాలు నీటిని తోడేసుకుని అమ్మేసుకున్నరని పోలీసులు చెబుతున్నరు. సురేశ్‌కుమార్ ఢోకా అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా నిజాలు బయటకు తీయడంతోనే ఈ లెక్కలన్నీ బయటకొచ్చినయ్. 2006 నుంచి 2017 మధ్య ఆ ఆరుగురు అందినకాడికి నీళ్లను కాజేశారని సురేశ్ కుమార్ పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిండు. పాండ్యా మాన్షన్ మీద అంతకుముందే ఇంకో కేసు కూడా నమోదైంది. ఆ రెండు బావులూ తమ జాగలోనే ఉన్నాయని బిల్డింగ్ ప్లాన్‌ను ఫోర్జరీ చేయించిన కేసులో లోక్మాన్య తిలక్ మార్గ్ పోలీసులు చార్జ్‌షీట్ నమోదు చేసిన్రు. ఇప్పుడు నీళ్ల చోరీ కేసులో ఇంకో కేసూ బుక్కైంది. ఇక, ఆ రెండు బావులనూ శాశ్వతంగా మూసేయాల్సిందిగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది.