మంచిర్యాల జిల్లా : నీళ్లు, నిధులు, నియమాకాల సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను విస్మరించారని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. సింగరేణిపై కేసీఆర్ అజమాయిషీ చెలాయిస్తూ.. సంస్థకు చెందిన సొమ్మును సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. సింగరేణి ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. మందమర్రిలో బీఎస్పీ జిల్లా కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ అర్చన, మద్దెల భవాని, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఎంవీ గుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు.
కేసీఆర్ ప్రభుత్వం కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టును రీ డిజైన్ చేసి మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. దాదాపు 50 నుంచి 60 వేల కోట్ల ఖర్చయ్యే ప్రాజెక్టు నిర్మాణానికి కేసీఆర్ సర్కార్ లక్షా 15 వేల కోట్లకు పెంచి.. రాష్ట్రంపై ఆర్థిక భారం మోపారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మంచిర్యాల జిల్లాకు చుక్కనీరు కూడా రాని పరిస్థితి నెలకొందన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాంట్రాక్టర్లకు, తమ బంధువులకు కేసీఆర్ అప్పగించారని ఆరోపించారు.
25 వేల మంది పోడు భూముల లబ్ధిదారులు ఉంటే కేవలం 200 మందికి మాత్రమే పోడు భూముల పట్టాలు ఇచ్చారని చెప్పారు. పోడు భూములు సాగు చేసుకునే వారందరికీ పట్టాలు ఇస్తామని చెబుతూనే.. గతంలో ఉన్న పోలీసు కేసుల సాకు చూపుతూ అనర్హులంటూ పట్టాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు.