పేపర్ లీకేజీలో కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉంది: ఆర్ఎస్ ప్రవీన్ కుమార్

పేపర్ లీకేజీలో కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉంది: ఆర్ఎస్ ప్రవీన్ కుమార్

TSPSC పేపర్ లీకేజీ తెలంగాణ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న అంశమని బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీన్ కుమార్ అన్నారు. మార్చి 11న జరిగిన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీని TSPSC చిన్న విషయంగా చూపించే ప్రయత్నం చేసిందని తెలిపారు. TSPSC పేపర్ లీకేజీపై మార్చి 19న మీడియా సమావేశంలో మాట్లాడారు ఆర్ఎస్ ప్రవీన్ కుమార్. 30 లక్షల మంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పోరాడుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. తాను నిరాహార దీక్షకు కూర్చుంటే ..దాన్ని అణిచివేసే ప్రయత్నం చేసిందని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పేపర్ లీకేజీలో సీఎం కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందని ఆరోపించారు. 30 లక్షల విద్యార్థుల భవిష్యత్తును చిన్న విషయంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు ప్రవీన్ కుమార్.

TSPSC పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీన్ కుమార్. కల్వకుంట్ల కవితకు సంబంధించిన జాగృతి సభ్యులకు ఈ పేపర్ లీక్ లో సంబంధం ఉన్నట్లు తెలుస్తుందన్నారు. పేపర్ లీక్ అంశాన్ని సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. TSPSC పై కనీస అవగాహన లేకుండా మంత్రి కేటీఆర్ మాట్లాడారని విమర్శించారు. TSPSC చైర్మన్ జనార్ధన్ పేరు కూడా నిందితుల జాబితాలో చేర్చాలన్నారు. సెక్షన్ 60 కింద జనార్ధన్ పైన కేసు పెట్టాలన్నారు. ఈ పేపర్ లీక్ లో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతోపాటు TSPSC లో పని చేస్తున్న ప్రతి ఒక్కర్ని విచారించాలని డిమాండ్ చేశారు. TSPSC చైర్మన్ గా ఉన్న జనార్ధన్ రెడ్డి రిజైన్ చెయ్యాలని సూచించారు. నిరుద్యోగులు ఎవరూ అధైర్య పడవద్దని తాము అండగా ఉంటామని ఆర్ఎస్ ప్రవీన్ కుమార్ భరోసా ఇచ్చారు.