సీఎం కేసీఆర్ నివసించడానికి వందల ఎకరాల భూమి ఉంటది కానీ, పేదలు 60 గజాల పూరీ గుడిసెలలో ఉండడానికి అర్హులు కాదా? అని బీఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ రెవెన్యూ సర్వే నం.283లో ఇటీవల గుడిసెలు వేసి భూ హక్కుదారుల కోసం పోరాడుతున్న బాధితులను ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అప్పటి హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదగా 2011లో ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పథకం కింద పట్టా సర్టిఫికేట్ లు మంజూరు చేసినా.. ఇప్పటికీ అవి అధికారుల దగ్గరే పెట్టుకొని కాలయాపన చేస్తూ బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎకరాలకు ఎకరాలు కబ్జాలు చేస్తే సహకరిస్తున్నఈ ప్రభుత్వం.. 583 మంది పేదల అర్హతను ఎందుకు గుర్తిస్తలేదని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఇదే సర్వే నంబర్ లో 300 అక్రమ కట్టడాలను 58,59 జీవో కింద రెగ్యులరైజ్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. కేసీఆర్ బడా పారిశ్రామిక వేత్తలతో చేతులు కలిపి వేల ఎకరాల పేదల భూములను అన్యాక్రాంతం చేశారని గుర్తు చేశారు. ఇదే మండలం బండరావిర్యాల గ్రామంలో 20 ఏండ్లుగా పారిశ్రామికవేత్తలతో చేతులు కలిపి పేదల భూములను మైనింగ్ జోన్ కింద తీసుకొని నిండు అసెంబ్లీలో తీర్మానం చేసి నేటికి నష్టపరిహారం ఇవ్వలేదని గుర్తు చేశారు.
ఇదంతా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కొంత మంది లీడర్ల కుట్రగా భావిస్తున్నామని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఇకమీద కేసీఆర్ కు ఓట్లేస్తే నిలువునా దోపిడీ చేసి బజార్లో నిలబెడుతాడని చెప్పారు. జాతీయ అధ్యక్షులు మాయావతి 1995 లో అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు లక్షల ఎకరాల పట్టా భూములు పంచిందన్నారు. అదే విధంగా తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం పేదల భూముల రేగ్యులరైజ్ ఫైల్ మీదనే సంతకం చేస్తాం అని హామీ ఇచ్చారు.
