బీఎస్పీ అధికారంలోకి రాగానే ‘ధరణి’ రద్దు చేస్తాం

బీఎస్పీ అధికారంలోకి రాగానే ‘ధరణి’ రద్దు చేస్తాం

రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి రాగానే ప్రతి నిరుపేద కుటుంబానికి ఒక ఎకరం భూమితో పాటు పట్టా కూడా అందిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. ప్రతి మండలానికి ఒక కార్పొరేట్ స్థాయి తరహాలో పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. అసైన్డ్ భూములు, పోడు భూములు ఉన్న రైతులకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటి నుండి ఒకరిని విదేశాలకు పంపించి, ఉన్నత చదువులు చదివిస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో పల్లెబాట ప్రారంభోత్సవ బహిరంగ సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గంలో బీఎస్పీ జెండా ఎగరాలని, పార్టీ కార్యకర్తలందరూ ఉత్సాహంగా పని చేయాలని పిలుపునిచ్చారు. 

బీఎస్పీ అధికారంలోకి రాగానే ‘ధరణి’ పథకాన్ని రద్దు చేస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో భూములన్నింటినీ ధరణి పేరుతో ప్రభుత్వం లాక్కుని, వెంచర్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. బీఎస్పీ..టీఆర్ఎస్ లా భూములను తీసుకోదన్నారు. 111జీవో తీసుకొచ్చి విలువైన భూములను లాక్కొంటున్నారని మండిపడ్డారు. బీఎస్పీని ఎన్ని విధాలుగా అడ్డుకున్నా.. రాబోయే కాలంలో ప్రగతిభవన్ కు తామే వెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను, వీఆర్వోలను పట్టించుకోవడం లేదని, ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించడం లేదని విమర్శించారు. హాస్టళ్లలో చదివే పిల్లలకు పురుగుల అన్నం పెడుతున్నారని, టీఆర్ఎస్ నాయకుల పిల్లలు ఇలాంటి అన్నం తింటారా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల అభివృద్ది పేరుతో కోట్ల రూపాయలను బడా కంపెనీలకు దోచి పెడుతోందని ఆరోపించారు. 

బీజేపీపైనా విమర్శలు
అగ్నిపథ్ పథకం యువకుల భవిష్యత్తుపై నీళ్లు చల్లిందని, బీజేపీ నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.