ఆధిపత్య పార్టీలన్నీ బీసీలను ఓటర్లుగానే చూస్తాయి : ఆర్ఎస్‌‌ ప్రవీణ్

ఆధిపత్య పార్టీలన్నీ బీసీలను  ఓటర్లుగానే చూస్తాయి : ఆర్ఎస్‌‌ ప్రవీణ్

హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయడంపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ ఎక్స్ (ట్విట్టర్)వేదికగా స్పందించారు. అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో  బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదనే ఆవేదనతోనే పొన్నాల కాంగ్రెస్ కు రిజైన్ చేశారని తెలిపారు. ఇది రాష్ట్రంలో బీసీల పట్ల ఉన్న రాజకీయ వివక్షతకు నిదర్శనమని వెల్లడించారు.  ఈ ఇష్యూ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమే అయినా పొన్నాల రాజీనామాను స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు అగ్రకుల, ఆధిపత్య పార్టీల జెండాలు, అజెండాలు ఎన్నేండ్లు మోసినా వారికి చివరకు మిగిలేది అవమానాలు మాత్రమేనని గుర్తుచేశారు.

కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్​వంటి ఆధిపత్య పార్టీలకు బీసీల ఓట్లు మాత్రమే కావాలని ఫైర్ అయ్యారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు మాత్రం కేటాయించరని చెప్పారు. ఇది కుల వివక్ష కాదా అని ప్రశ్నించారు.  బీఆర్ఎస్​పార్టీ జనాభాలో 4 శాతం ఉన్న రెడ్లకు 43సీట్లు, ఒక్క శాతం కూడా లేని వెలమలకు 16 అసెంబ్లీ సీట్లు కేటాయించిందని వివరించారు.

కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఇంతకంటే ఎక్కువ ఊహించలేమని తెలిపారు. బీసీలకు సీట్లు కేటాయించడంలో అన్ని పార్టీలు వివక్ష చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్పీ మాత్రమే బీసీలకు 60 నుంచి 70 సీట్లు కేటాయిస్తున్నదని వెల్లడించారు. మహాత్మా ఫూలే కలలు కన్న బహుజన రాజ్య స్థాపన కోసం బీఎస్పీలో చేరాలని ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.