కుమ్రంభీం స్ఫూర్తితో రాజ్యాధికారం సాధించాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కుమ్రంభీం స్ఫూర్తితో రాజ్యాధికారం సాధించాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  •     గిరిజన హక్కులను పాలకులు కాలరాస్తున్నారు
  •     బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీం స్ఫూర్తితో రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం అంబగట్టలో ఆదివాసీ సంఘాలతో కలిసి పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కుమ్రంభీం విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు స్థిర నివాసం కూడా లేని దుస్థితిలో బతుకుతున్నారని ఆవేదన చెందారు.

తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పోడు పట్టాలు ఇవ్వడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. గిరిజన హక్కులు, చట్టాలను ఆధిపత్య పాలకులు తుంగలో తొక్కి అన్యాయం చేస్తున్నారని.. పేసా చట్టం, 1/70, జీఓ నంబర్‌ 3 లాంటి హక్కులను, చట్టాలను ఆదివాసీలకు చెందకుండా పాలకులు కుట్రలు చేస్తున్నారని, ఆదివాసులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఆదివాసీలకు 100 శాతం ఉద్యోగాలు కల్పించే జీవో 3 ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

పులిని చంపారనే అనుమానంతో పశువుల కాపరులైన ఆదివాసులను ఫారెస్ట్ అధికారులు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి జైలు పాలుచేశారని అన్నారు. పసి పిల్లలను కూడా పోలీసులు నిర్బంధించడం విచారకరమన్నారు. ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎస్టీలను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం తక్షణమే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, జిల్లా అధ్యక్షుడు లెండుగురే శ్యామ్ రావు, నాయకులు సోయం చిన్నన్న, సిడెం జ్యోతి, జాడి శ్యామ్ రావు, రాజ్ కుమార్, దుర్గం వెంకటేశ్​తదితరులు పాల్గొన్నారు.