హెల్మెట్టున్నా.. పట్టీ​ పెట్టుకోకపోతే రూ.1,000 ఫైన్

హెల్మెట్టున్నా.. పట్టీ​ పెట్టుకోకపోతే రూ.1,000 ఫైన్
  • ఐఎస్​ఐ మార్క్​ లేని హెల్మెట్​ వాడినా రూ. వెయ్యి కట్టాల్సిందే
  • సిగ్నల్​ జంప్​ చేస్తే రూ. 2 వేలు జరిమానా
  • మోటర్​ వెహికల్​ యాక్ట్​లో సవరణలు చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: టూవీలర్​ నడిపేటప్పుడు హెల్మెట్​ధరించినప్పటికీ  దానికున్న పట్టీ​ సరిగ్గా పెట్టుకోకపోయినా వెయ్యి రూపాయల ఫైన్​ తప్పదు. వాడే హెల్మెట్​ ఐఎస్​ఐ మార్క్​కు సంబంధించింది కాకపోయినా రూ. 1,000 జరిమానా చెల్లించాల్సిందే.  హెల్మెట్​ పెట్టుకున్నప్పటికీ సిగ్నల్​ జంప్​ చేసినా, ఇతర ట్రాఫిక్​ రూల్స్​ ఉల్లంఘించినా.. రూ. 2 వేల దాకా ఫైన్​ పడుతుంది. హెల్మెట్​ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ,  ఐఎస్​ఐ మార్క్ లేని హెల్మెట్లను నిషేధిస్తూ 2021లోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే,  చాలా మంది ఈ రూల్స్​ పాటించడం లేదు. దీంతో  కేంద్రం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈ మేరకు తాజాగా మోటార్​ వెహికల్​ యాక్ట్​ 1998లో మార్పులు తీసుకువచ్చింది. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. చలాన్లు తప్పించుకోవడం కోసం కొందరు హెల్మెట్​ను తలకు తగిలించుకోవడం తప్పితే దానికున్న బటన్​/బకిల్​ను పెట్టుకోవడం లేదు. ఇలాంటి చర్యల వల్ల.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్​ తలపై నుంచి ఎగిరిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎదురవుతున్నది. 
నిబంధనలు, జరిమానాలు ఇట్లా..

  •     బైక్​ నడిపేటప్పుడు  హెల్మెట్​ తలకు పెట్టుకున్నప్పటికీ దాని పట్టీ/బ్యాండ్​  పెట్టుకోకుంటే రూ. వెయ్యి ఫైన్.
  •     వాడే హెల్మెట్​ బ్యూరో ఆఫ్​ ఇండియన్​ స్టాండర్డ్స్​ (బీఐఎస్​) సర్టిఫికెట్​, లేదా ఐఎస్​ఐ మార్క్​ ఉన్నవై ఉండాలి. ఇవి తప్ప వేరే హెల్మెట్లు వాడితే రూ. వెయ్యి జరిమానా పడుతుంది. 
  •     ఐఎస్​ఐ మార్క్​లేని హెల్మెట్​ ధరించి, దానికున్న పట్టీ సరిగ్గా పెట్టుకోకపోతే.. రెండు ఉల్లంఘనల కింద రూ. 2 వేల ఫైన్​ కట్టాల్సి ఉంటుంది. 
  •    హెల్మెట్​ను కరెక్ట్​గా పెట్టుకున్నప్పటికీ.. రెడ్​ సిగ్నల్​ను  జంప్​ చేసినా, ట్రాఫిక్​ రూల్స్​ ఉల్లంఘించినా రూ. 2 వేల వరకు జరిమానా పడుతుంది. పైగా 3 నెలల పాటు లైసెన్స్​ రద్దయ్యే అవకాశం ఉంది.