21.9 కోట్ల విలువైన నోట్లకట్టలు..

21.9 కోట్ల విలువైన నోట్లకట్టలు..

నగలు, ఆస్తి పత్రాలు కూడా..
కొనసాగుతున్న ఈడీ సోదాలు

కోల్​కతా: బెంగాల్​ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో ఇంకో 15 కోట్లు దొరికాయని ఈడీ అధికారులు చెప్పారు. అర్పితకు చెందిన బెల్ఘోరియా ఫ్లాట్​లో బుధవారం అధికారులు సోదాలు నిర్వహించారు. ఫ్లాట్​లో నోట్లకట్టలు బయటపడడంతో బ్యాంకు అధికారులను పిలిపించారు. ఐదు కౌంటింగ్​ మెషిన్లతో అక్కడికి చేరుకున్న ఆఫీసర్లు.. నోట్లకట్టల లెక్కింపు మొదలుపెట్టారు. బుధవారం రాత్రి పొద్దుపోయేదాకా ఈ లెక్కింపు కొనసాగుతూనే ఉంది. దాదాపుగా 15 కోట్లకు పైనే నగదు, 3 కిలోలకు పైగా బంగారు నగలు, వెండి నాణాలు దొరికినట్లు ఈడీ అధికారులు చెప్పారు. అర్పితా ముఖర్జీకి చెందిన టాలిగంజ్​ ఫ్లాట్​లో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు జరిపారు. అందులో 21.9 కోట్ల విలువైన నోట్లకట్టలు, 76 లక్షల విలువైన బంగారు నగలతో పాటు పలు ఆస్తి పత్రాలు దొరికినట్లు వెల్లడించారు. ఆ ఆస్తి పత్రాల్లోని వివరాల ఆధారంగా బెల్ఘోరియాలో అర్పితకు ఉన్న ఫ్లాట్​ను గుర్తించి, బుధవారం సోదాలు జరిపినట్లు వివరించారు. దీంతోపాటు మరో రెండు ఫ్లాట్లలో సోదాలు జరుపుతున్నట్లు అనధికార సమాచారం. మనీలాండరింగ్​ కేసులో మంత్రి పార్థా ఛటర్జీని, అర్పితా ముఖర్జీని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారు.