హిమాచల్‌‌‌‌కు రూ.15 వందల కోట్లు.. అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రధాని మోదీ హామీ

హిమాచల్‌‌‌‌కు రూ.15 వందల కోట్లు.. అన్ని విధాలుగా అండగా ఉంటామని  ప్రధాని మోదీ హామీ
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే, రివ్యూ 

సిమ్లా/ధర్మశాల: వర్షాలు, వరదలతో అతలాకుతలమైన హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.1,500 కోట్లు ప్రకటించారు. అలాగే చనిపోయినోళ్ల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినోళ్లకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పారు. 

హిమాచల్‌‌‌‌లోని వరద ప్రభావిత, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో మోదీ మంగళవారం ఏరియల్ సర్వే చేశారు. అనంతరం కాంగ్రాలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు.

 ‘‘కూలిపోయిన ఇండ్లను పీఎం ఆవాస్ యోజన కింద నిర్మిస్తాం. డ్యామేజీ అయిన పాఠశాలలకు, దెబ్బతిన్న నేషనల్ హైవేలకు రిపేర్లు చేస్తాం” అని వెల్లడించారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను ఇప్పటికే రాష్ట్రానికి పంపించామని, వాళ్లిచ్చే నివేదికతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తుల ఆధారంగా తదుపరి సాయం అందజేస్తామని పేర్కొన్నారు. 

సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, రాష్ట్ర సిబ్బంది కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. కాగా, వర్షాలు, వరదలతో పాటు కొండచరియలు విరిగిపడి హిమాచల్​లో రూ.4,122 కోట్ల నష్టం జరిగినట్టు అధికారుల అంచనా. ఇప్పటి వరకు 370 మంది చనిపోయారు. మరో 41 మంది గల్లంతయ్యారు.

పంజాబ్‌‌‌‌కు 1,600 కోట్లు..  

వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న పంజాబ్‌‌‌‌ను ఆదుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. రాష్ట్రానికి రూ.1,600 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినోళ్లకు రూ.50 వేల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. గురుదాస్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో రివ్యూ మీటింగ్ నిర్వహించి, వరద బాధితులను పరామర్శించారు.

చిన్నారిని ఎత్తుకున్న ప్రధాని.. 

వరద బాధితులను మోదీ పరామర్శించారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  వరదల్లో కుటుంబమంతా చనిపోయినా.. బతికి బయటపడ్డ 11 నెలల పాప నితికను మోదీ ఎత్తుకున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌‌‌‌గా మారింది.