ప్రపంచంలోనే అతిపెద్ద సేవాసంస్థ ఆర్‌ఎస్‌ఎస్

ప్రపంచంలోనే అతిపెద్ద సేవాసంస్థ ఆర్‌ఎస్‌ఎస్

పిట్లం, వెలుగు: పిట్లం శివాజీ శాఖ ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం విజయదశమి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధాన వక్తగా సంస్కార భారతి తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి జేపీ నిరంజన్ పాల్గొని, మాట్లాడారు. ప్రపంచంలోనే పెద్ద సేవా, జాత్యవాద సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అని పేర్కొన్నారు. 1925లో నాగ్‌పూర్‌లో హిందూ సంఘటనే లక్ష్యంగా ఏర్పడిన ఆర్‌ఎస్‌ఎస్‌కు దేశవ్యాప్తంగా 50కి పైగా పరివార క్షేత్రాలు పని చేస్తున్నాయన్నారు. 

ఉత్సవాలలో భాగంగా స్వదేశీ, సమరసత, పర్యావరణం, పౌరవిధులు, కుటుంబ బోధన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమాన్ని దుర్గామాత శస్త్ర పూజతో ప్రారంభించారు. విభాగ్ సహధర్మ జాగరణ ప్రముఖులు, జిల్లా ప్రచార్ ప్రముఖులు, ఖండ కార్యావాహులు, బౌద్ధిక్ ప్రముఖులు, స్వయం సేవకులు పాల్గొన్నారు. 

ఆర్మూర్​లో బస్తీబాట  

ఆర్మూర్ : హిందువుల ఐక్యత కోసం ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆర్మూర్‌లో బస్తీబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు వరంగంటి శ్రీనివాస్, పాలేటి వెంకట్​రావు మాట్లాడుతూ 1925లో ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్ నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, వివిధ రంగాల్లో దేశభక్తి పూరిత హిందుత్వ సేవా సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాల్లో పని చేస్తుందన్నారు. దేశ అభివృద్ధికి హిందువుల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.