సైన్యానికి అండగా యావత్ దేశం.. పాక్​పై చర్యలు అభినందనీయం: మోహన్ భగవత్​

సైన్యానికి అండగా యావత్ దేశం.. పాక్​పై చర్యలు అభినందనీయం: మోహన్ భగవత్​
  • ఆపరేషన్​ సిందూర్​తో దేశగౌరవం పెరిగిందని వెల్లడి

న్యూఢిల్లీ: టెర్రరిస్టులు, వారికి సాయం చేస్తున్న పాకిస్తాన్​పై భారత ఆర్మీ చేపడుతున్న చర్యలకు యావత్ దేశం అండగా నిలుస్తున్నదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌) సర్​ సంఘ్​ చాలక్ మోహన్ భగవత్ అన్నారు. ఆపరేషన్ ​సిందూర్​ చేపట్టిన ఆర్మీని, పూర్తి సహకారం అందించిన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. భారత దేశ భద్రతకు ఈ చర్యలు అత్యవసరమని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్​తో పహల్గామ్ దాడి బాధితులకు న్యాయం జరుగుతుందని, ఇండియా ఆత్మగౌరవం, ధైర్యాన్ని పెంచుతుందని తెలిపారు. 

శుక్రవారం ఆయన ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలేతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘పహల్గామ్‌‌లో నిరాయుధ పర్యాటకులపై జరిగిన దాడికి సమాధానంగా ‘ఆపరేషన్ సిందూర్’ కింద టెర్రరిస్టులు, వారికి మద్దతు ఇచ్చే పాక్‌‌పై తీసుకున్న నిర్ణయాత్మక చర్యలకు కేంద్ర ప్రభుత్వ నాయకత్వాన్ని, సైనిక బలగాలను అభినందిస్తున్నాం’’ అని భగవత్ ​పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్మీ చేపట్టిన చర్యలు దేశ భద్రతకు అవసరమన్నారు. 

ఈ సంక్షోభ సమయంలో యావత్ ​దేశం సైన్యం, కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఐక్యంగా నిలుస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసే సూచనలను పూర్తిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సామాజిక ఐక్యత, ప్రజల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే దేశ వ్యతిరేక శక్తుల కుట్రలను సఫలం కానీయకూడదని పిలపునిచ్చారు. జాతీయ ఐక్యత, భద్రతను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు.