
ఢిల్లీ : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముస్లిం మత పెద్దలతో భేటీ అయ్యారు. సంఘ్ ప్రచారక్ ఇంద్రేష్ కుమార్ తో కలిసి కస్తూర్బా గాంధీ మార్గ్లోని మసీదుకు వెళ్లిన ఆయన.. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీతో భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు వారి రహస్య సమావేశం సాగింది. అనంతరం మదర్సాను సందర్శించిన ఆర్ఎస్ఎస్ చీఫ్.. అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు.
మోహన్ భవగత్ తో భేటీ అనంతరం ఇలియాసీ మీడియాతో మాట్లాడారు. మనందరిదీ ఒకే డీఎన్ఏ అని అయితే దేవున్ని పూజించే విధానం మాత్రమే భిన్నంగా ఉంటుందని అన్నారు. మరోవైపు ఈ భేటీపై స్పందించిన ముస్లిం మతపెద్దలు.. ఇది దేశానికి మంచి సందేశాన్ని పంపుతుందని అభిప్రాయపడ్డారు. తామంతా కుటుంబ సభ్యుల్లా చర్చించామని, తమ ఆహ్వానాన్ని మన్నించి మోహన్ భగవత్ తమను కలిసేందుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు.
మత సామరస్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా మోహన్ భగవత్ ముస్లింపెద్దలను కలిశారని ఆర్ఎస్ఎస్ ప్రకటించింది. కర్నాటకలో హిజాబ్ ఘటన, మహమ్మద్ ప్రవర్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలు తదనందరం చెలరేగిన హింస నేపథ్యంలో ఈ పరిణామం చాలా కీలకంగా మారింది. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలోని ఒక మందిరంలో హిందువులు ప్రార్థనలకు అనుమతించాలన్న పిటిషన్, ప్రతి మసీదు కింద ఒక శివలింగాన్ని వెతకాలన్న మోహన్ భగవత్ ప్రకటన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం చర్చనీయాంశంగా మారింది.