మణిపూర్​ హింస విదేశీ శక్తుల పనే! : ఆరెస్సెస్ ​చీఫ్ ​మోహన్ ​భగవత్

మణిపూర్​ హింస విదేశీ శక్తుల పనే! : ఆరెస్సెస్ ​చీఫ్ ​మోహన్ ​భగవత్

నాగ్​పూర్: మణిపూర్ హింసాకాండ వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్​ భగవత్​అన్నారు. దసరా సందర్భంగా నాగ్​పూర్​లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘విజయదశమి ఉత్సవం’లో మోహన్ భగవత్ మాట్లాడారు. ‘మణిపూర్​లో అనేక సంవత్సరాలుగా మైతీలు, కుకీలు కలిసిమెలిసి ఉంటున్నారు. అలాంటప్పుడు ఒక్కసారిగా హింస ఎలా చెలరేగింది? అక్కడ హింస జరగడం లేదు.. జరిగేలా చేస్తున్నారు.

ఇందులో విదేశీ శక్తుల పాత్ర ఉందా? ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు విదేశీ శక్తులకే మేలు చేస్తాయి. కొంతమంది సంఘ వ్యతిరేక వ్యక్తులు తమను తాము సాంస్కృతిక మార్క్సిస్టులుగా చెప్పుకుంటున్నారు. అయితే, వారు మార్క్స్​ను మరిచిపోయారు. ప్రపంచంలోని మంచి వ్యవవస్థలు, శుభం, సంస్కారం, సంయమనం పట్ల వారికి ఎల్లప్పుడూ విరోధమే. గుప్పెడు మంది చేతుల్లో అధికారం, వారి అజమాయిషీ కోసం అరాచకత్వం, విశృంఖలత్వాలను ప్రచారం చేస్తారు. మీడియా, ఇతర పద్ధతుల ద్వారా దేశాల్లో విద్య, సంస్కారం, రాజకీయ సామాజిక రంగాల్లో భ్రమలను, భ్రష్టత్వాన్ని పెంచడమే వీరి కార్యశైలి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. దేశ ఐక్యత, సమగ్రత, గుర్తింపు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలి’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.

మణిపూర్‌‌లో శాంతి పునరుద్ధరణకు కృషి చేసిన సంఘ్ కార్యకర్తలను చూసి తాను గర్వపడుతున్నట్లు చెప్పారు. జనవరి 22న అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నామని, దేశవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేసి వేడుకలు నిర్వహించాలని భగవంత్​ ప్రజలను కోరారు. జీ 20 సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు భారతదేశ 'భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు. సమస్యల నుంచి బయటపడేందుకు ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు. చంద్రయాన్​సక్సెస్, ఆసియా క్రీడల్లో మన దేశ క్రీడాకారులు 107 పతకాలు సాధించినందుకు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నట్లు తెలిపారు.