బీజేపీ ప్రచారంలో ఆర్ఎస్ఎస్

బీజేపీ ప్రచారంలో ఆర్ఎస్ఎస్

హైదరాబాద్, వెలుగు: రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో కీలకంగా వ్యవహరించాలని ఆర్ఎస్ఎస్, దాని పరివార క్షేత్రాలు నిర్ణయించాయి. మంగళవారం హైదరాబాద్​లో సంఘ్ పెద్దలతో రెండు విడతలుగా బీజేపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఓ ప్రైవేట్ ప్లేస్ లో జరిగిన మొదటి సమావేశంలో ఆర్ఎస్ఎస్ తెలంగాణ క్షేత్ర ముఖ్య నేతలతో రాష్ట్ర బీజేపీ ఎన్నికల సహా ఇన్​చార్జ్ సునీల్ బన్సల్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ భేటీ అయ్యారు. 

సాయంత్రం బర్కత్ పురలోని సిటీ బీజేపీ ఆఫీసులో జరిగిన రెండో విడత మీటింగ్ లో తెలంగాణ క్షేత్ర ఆర్ఎస్ఎస్ ముఖ్యులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, రాబోయే ఎన్నికల్లో సంఘ్ తో సమన్వయంపై చర్చించారు. పార్టీ మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై ఇరు పక్షాలు చర్చించినట్టు సమాచారం. పార్టీ పరంగా వెంటనే చేయాల్సిన పనులు, పార్టీతో కలిసి సంఘ్ చేయాల్సిన ప్రోగ్రామ్ లపై సంఘ్ పెద్దలు.. బీజేపీ నేతలతో చర్చించారు. బీజేపీ వీక్ గా ఉన్న పోలింగ్ బూత్ లలో ఎన్నికల పనులను సంఘ్ పరివార క్షేత్రాలు స్వయంగా పర్యవేక్షించనున్నాయి. 

నియోజకవర్గాల వారీగా పోలింగ్ బూత్​లను ఒక్కో ఆర్ఎస్ఎస్ క్షేత్రానికి అప్పగించాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీల్లో కూడా సంఘ్ నేతలకు చోటు కల్పించనున్నారు.