
- అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీఏ అధికారుల కసరత్తు
- ఓనర్షిప్ ట్రాన్స్‌ఫర్, రిజిస్ట్రేషన్లు కూడా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రవాణా శాఖ అందించే ఆన్లైన్ సర్వీసులు మరిన్ని పెరగనున్నాయి. ఇప్పటికే డూప్లికేట్ లెర్నింగ్.. డ్రైవింగ్ లైసెన్సులు, బ్యాడ్జి, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, అడ్రస్ మార్పు, క్లియరెన్స్ సర్టిఫికెట్, కొత్త పర్మిట్, డూప్లికేట్ పర్మిట్ కార్డు వంటి 17 రకాల సేవలు ఆన్లైన్లో అందిస్తుండగా.. ఇంకిన్ని సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 59 రకాల ఆర్టీఏ సేవలు అందుతున్నాయి. ఇందులో 17 రకాల సర్వీసులను ఈమధ్యే ఆన్లైన్ చేశారు. మిగతావన్నీ మాన్యువల్‌గానే జరుగుతున్నాయి. దీంతో వాహనదారులు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లటం తప్పనిసరవుతోంది. ఇదే అదనుగా డబ్బులు దండుకుంటున్న ఏజెంట్లు, బ్రోకర్ల బెడద లేకుండా చేసేందుకు కొన్ని కీలక సేవలను ఆన్లైన్ చేసేందుకు కృషి చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఇందులో ఓనర్షిప్ ట్రాన్స్‌ఫర్, లెర్నింగ్ లైసెన్స్(ఎల్‌ఎల్‌ఆర్), రిజిస్ట్రేషన్లు తదితర సర్వీసులు ఉండనున్నాయి. ఈ సేవలను గతంలోనే తీసుకురావాలని అనుకున్నప్పటికీ టెక్నికల్ సమస్యల వల్ల నిలిపేశారు.