
ముషీరాబాద్ వెలుగు : ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ను యూనియన్ ప్రతినిధులు కలిశారు. ఆర్టీసీలో ఉన్న సమస్యలు, కార్మికుల ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం యూనియన్ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, కార్యదర్శి సుద్దాల సురేశ్ మాట్లాడుతూ..కొత్త ప్రభుత్వం వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.
కార్మికులకు రావాల్సిన డీఏ ఏరియర్స్, బాండ్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. యునియన్ చేసిన విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్, సురేఖ, సునీత,యాదయ్య, మల్లయ్య, రవి కిరణ్, నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.