ఏసీ బస్టాప్ లే అడ్డా.. ఆర్టీసీ బ్రోకర్ల దందా 

ఏసీ బస్టాప్ లే అడ్డా.. ఆర్టీసీ బ్రోకర్ల దందా 
  • ఆర్టీఏ సెంట్రల్​ జోన్​ ఖైరతాబాద్​ఆఫీసు వద్ద ఇదీ పరిస్థితి

ఖైరతాబాద్​ ​,వెలుగు : అవినీతి ఆరోపణలతో రవాణా శాఖ ఆఫీసులపై ఇటీవలే ఏసీబీ దాడులు చేసినా..అధికారుల్లో మార్పులేదు. ఆర్టీసీ బ్రోకర్లు ఏసీ బస్సు స్టాప్​లు అడ్డగా దందా నడిపిస్తున్నారు.  ఖైరతాబాద్​రవాణా శాఖ ఆఫీసు మెయిన్ గేట్ కు అనుకుని ఉన్న బస్టాప్ ఉంది. డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్​టెస్ట్​, వాహనాల రిజిస్ట్రేషన్ తోపాటు వాహన బదిలీ, ఇతర పనులపై సెంట్రల్​జోన్​  ఖైరతాబాద్​ఆర్టీఏ ఆఫీసుకు నిత్యం వందలాది ప్రజలు వస్తుంటారు. వారిలో కొందరికి ఆఫీసులోఎక్కడ ఏ పని చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు.

ఆర్టీఏ ఆఫీసుల్లో చేతులు తడిపితేనే గాని పనులు చేయరనే భావన కూడా ఉంది. మెయిన్ గేట్ ముందు కాసుకుని ఉండే బ్రోకర్లు కస్టమర్ల అవసరాన్ని గుర్తించి పని చేస్తామని ఎదురెళ్లి అడుగుతుంటారు. తెలిసిన వారు  డైరెక్టుగా ఆఫీసులోకి వెళితే.. తెలియని వాళ్లు బ్రోకర్లను ఆశ్రయిస్తారు. ఇలా బ్రోకర్ల దందా ఆర్టీఏ అధికారుల కనుసన్ననలోనే జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి.

అక్కడ జరిగిన లావాదేవీల్లో సాయంత్రానికి ఎవరికి అందాల్సినవి వారికి అందుతాయి. దీనిపై  ఏసీబీ అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో రెండు వారాల కిందట సిటీలోని పలు ఆర్టీఏ ఆఫీసులపై  ఏసీబీ అధికారులు దాడులు చేసినది తెలిసిందే. అయినా..ఆర్టీఏ ఆఫీసుల్లో అధికారుల తీరుమారడంలేదు. ఆర్టీసీ ఏసీ బస్టాపును తమ దందాకు వాడుకుంటుండగా.. బస్సులు ఎక్కేందుకు వచ్చిన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.