బస్సొస్తలేదు: ప్రగతి రథ చక్రం.. పల్లెలకు దూరమైతాంది

బస్సొస్తలేదు: ప్రగతి రథ చక్రం.. పల్లెలకు దూరమైతాంది

నెట్​వర్క్, వెలుగు: ప్రగతి రథ చక్రం.. పల్లెలకు దూరమైతాంది. ఇన్నాళ్లు ఊరును, టౌనును కలుపుతూ వచ్చిన ‘పల్లె వెలుగు’ బస్సులను ఆర్టీసీ క్రమంగా వదిలించుకుంటోంది. ఆదాయం వచ్చే రూట్లలో ఎక్స్​ప్రెస్​లు, సూపర్​లగ్జరీలను నడిపేందుకే సంస్థ ప్రాధాన్యం ఇస్తోంది. తెలంగాణ వచ్చాక కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుడు దాదాపు బంద్​పెట్టింది. నాలుగు నెలలుగా బిల్లులు ఇయ్యక అద్దె బస్సులూ ఆగిపోయాయి. దీంతో వేలాది గ్రామాలకు పల్లె వెలుగు సర్వీసులు బంద్ అయ్యాయి. ఇగ పొద్దున్నే పాలు, పండ్లు, కూరగాయలతో పట్నం పోయే పల్లె జనాలకు ఆటోలే దిక్కైతున్నాయి. స్కూళ్లు, కాలేజీలు నడుస్తలెవ్వుగానీ, లేకుంటే ఊరూరా స్టూడెంట్లు ఆందోళన బాట పట్టేవారే! 
ఆటోల్లో ప్రయాదకరంగా ప్రయాణాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రానికి గతంలో నడిచిన పల్లె వెలుగు బస్సులను బంజేశారు. కేవలం ఒక్కటే బస్సును, అదీ రెండు ట్రిప్పులు మాత్రమే నడిపిస్తున్నారు. దీంతో ఇక్కడి 8 గ్రామ పంచాయతీల పరిధిలోని జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 50 కిలోమీటర్ల దూరంలోని మహదేవపూర్​కు ఆటోల్లో ఇలా ప్రమాదకరంగా వెళ్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్​ వాహనాల్లో రెట్టింపు చార్జీలు తీసుకుంటున్నారని పబ్లిక్ వాపోతున్నారు. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉండి భూపాలపల్లికి వెళ్లాలంటే రూ.వెయ్యి వరకు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ అనగానే ఒకప్పుడు ఊర్లలో తిరిగిన ఎర్ర బస్సులే గుర్తుకు వస్తాయి. ఈ ఆర్డినరీ బస్సులే సంస్థ ఆదాయంలో కీలక పాత్ర పోషించేవి. కానీ ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్​) తక్కువ ఉంటోందనే సాకుతో ఆర్టీసీ క్రమంగా ఆర్డినరీ బస్సులను తగ్గించుకోవడం మొదలుపెట్టింది. స్క్రాప్​కింద తొలగిస్తున్న వాటి స్థానంలో కొత్తవి కొనుడు బంద్​పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో 70 శాతంగా ఉన్న ఆర్డినరీ బస్సుల వాటా, ప్రస్తుతం 36 శాతానికి పడిపోయింది. 2019 సమ్మె కు ముందు10,460 బస్సులు ఉండగా, గత 19 నెలల్లో 696 బస్సులను అఫీషియల్​గా స్క్రాప్​చేసేశారు. ప్రస్తుతం స్టేట్​వైడ్​11 రీజియన్లు, 97 డిపోల పరిధిలో 9,734 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. వీటిలో పల్లె వెలుగు బస్సుల సంఖ్య కేవలం 3,524 మాత్రమే. అందులోనూ1,723 అద్దె​బస్సులే. వాటిని తీసేస్తే ఆర్టీసీ వద్ద ఉన్న ఆర్డినరీ బస్సుల సంఖ్య కేవలం1,801. ఇందులో సగం వరకు కాలం చెల్లి డిపోలకే పరిమితమయ్యాయి. మరో 180 బస్సులను కార్గో సర్వీసులుగా కన్వర్ట్​ చేశారు. నాలుగు నెలలుగా అద్దె బిల్లులు చెల్లించకపోవడంతో అద్దె​బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లు బంద్​పెట్టారు. అంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 700 నుంచి 800 ఆర్డినరీ బస్సులు కూడా నడవట్లేదు. కానీ సంస్థ మాత్రం ఇప్పటికీ 9,377 గ్రామాలకు సేవలందిస్తున్నట్లు తన ఆఫీషియల్​వెబ్​సైట్​లో గొప్పలు చెప్పుకుంటోంది. 
ఆర్డినరీ బస్సు ఒక్కటన్నా కొనలే.. 
‘పల్లెలకు బస్సులు వేస్తే ఇన్​కం రావట్లేదు. ఇటీవల కొన్నిచోట్ల ట్రయల్‌‌‌‌ వేసి చూశాం. మొత్తం నష్టాలే” అని ఆర్టీసీలోని ఓ అధికారి చెప్పడాన్ని బట్టి చూస్తే.. ఊర్లకు బస్సులు నడిపే విషయంలో ఆర్టీసీ ఆలోచన విధానం ఏంటో అర్థమవుతోంది. తెలంగాణ వచ్చాక 600 కొత్త బస్సులు కొన్నట్లు ఆఫీసర్లు చెబుతుండగా.. వాటిలో ఏసీ, ఎలక్ర్టిక్​బస్సులు, సూపర్​లగ్జరీలు తప్ప ఆర్డినరీ బస్సులే లేవు. గతంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకూ బస్సులు నడుపుతామని ప్రభుత్వం చాలాసార్లు ప్రకటించినా, ఆ దిశగా కనీస చర్యలు లేవు. సంస్థ నష్టాల్లో ఉండటం, కొత్త బస్సులు కొనడానికి డబ్బులు లేకపోవడంతోనే అద్దె​బస్సులను తీసుకొని ‘పల్లె వెలుగు’లుగా నడిపిస్తున్నామని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పుడు ఆ అద్దె​బస్సులు కూడా ఆగిపోవడంతో పల్లె జనం ఇబ్బందులు పడుతున్నారు.  
స్ర్కాప్ పాలసీ వస్తే.. ఒక్కటన్నా మిగలదు 
మరోవైపు ఇప్పటికే సిటీలో వెయ్యి, జిల్లాల్లో దాదాపు అంతే సంఖ్యలో ఆర్డినరీ బస్సులను తగ్గించిన ఆఫీసర్లు.. కొత్త స్క్రాప్​ పాలసీ వస్తే ప్రతినెలా 200 బస్సుల వరకు తుక్కు కింద అమ్మాల్సి ఉంటుందని చెబుతున్నారు. తద్వారా మిగిలే కార్మికులను ఏదో రకంగా బయటకు  పంపించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్లే చిన్న చిన్న కారణాలతో ఇప్పటికే  సుమారు 850 మందికి పైగా కార్మికులను సస్పెండ్​ చేసి డిపో స్పేర్​లో పెట్టారు. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్(సీఆర్ఎస్) ద్వారా 55 ఏళ్లు పైబడిన వారిని, 33 ఏళ్ల సర్వీసు నిండిన వారిని బయటకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కరోనా ఫస్ట్, సెకండ్​వేవ్​ తర్వాత ఆర్టీసీకి రూ.3 వేల కోట్ల నష్టం వచ్చింది. ఫలితంగా ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేక, అద్దె​బస్సులకు బిల్లులు చెల్లించలేక సంస్థ సతమతమవుతోంది. ఇలాంటి తరుణంలో ఆదుకోవాల్సిన సర్కారే పీకల్లోతు అప్పుల్లో మునిగి ఉంది. దీంతో ఆర్టీసీ కొత్తగా ఆర్డినరీ బస్సులు కొని నడిపిస్తుందనే ఆశలు కనుచూపు మేర కనిపించడం లేదు.  

ఎగ్జామ్స్ కు ఆటోలో పోయిన..  
పల్లె వెలుగు బస్సులు లేకపోవడంతో కొత్తగూడెంలో డిగ్రీ ఎగ్జామ్స్ రాసేందుకు చాలా ఇబ్బంది పడ్డాం. ఆటోల్లో కొంతదూరం వెళ్లి, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కాల్సి వచ్చింది. ఎగ్జామ్స్​ టైమ్​లోనైనా పల్లె వెలుగు బస్సులను నడిపితే బాగుంటుంది. 
                                                                                                                                                            ‑ స్రవంతి, బోడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 

పల్లె వెలుగు బస్సులు నడపాలె.. 
కోదాడ నుంచి  నర్సింహులగూడెం వరకు గతంలో నడిచిన పల్లె వెలుగు బస్సులు బందైనయ్. వివిధ పనుల కోసం మండల కేంద్రంతో పాటు కోదాడ, సూర్యాపేట లాంటి పట్టణాలకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నం. బస్సుల్లేక ఆటోల్లో పోతున్నం. వాళ్లేమో ఎక్కువ మందిని ఎక్కిస్తూ, ఎక్కువ చార్జీలు తీసుకుంటున్రు. పల్లె వెలుగు బస్సులను ప్రభుత్వం వెంటనే నడపాలి.
                                                                                                                                 ‑ పొనుగోటి రంగా, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా