కేటీఆర్ మీటింగ్ కు వెళ్లిన ఆర్టీసీ బస్సులు.. బస్టాండులో ప్రయాణికుల పడిగాపులు

కేటీఆర్ మీటింగ్ కు వెళ్లిన ఆర్టీసీ బస్సులు.. బస్టాండులో ప్రయాణికుల పడిగాపులు

మహబూబాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేటీఆర్ టూర్ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలించేందుకు మహబూబాబాద్ డిపో కు చెందిన సుమారు 25 బస్సులను బుక్ చేసుకున్నారు. దీంతో దాదాపు 25 ఆర్టీసీ బస్సులు మహబూబాబాద్ కు వెళ్లడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. 

సమయానికి బస్సులు లేక బస్టాండ్ లో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ అధికారులు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదని సమాచారం అందుతోంది. ఆర్టీసీ ఆధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రతిపక్ష నేతల అరెస్ట్

మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం ఐటీశాఖ మంత్రి కేటీఆర్ టూర్ సందర్భంగా ప్రతిపక్ష నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. మహబూబాబాద్, కురవి, బయ్యారం మండలాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, న్యూడెమోక్రసీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నాయకులను అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న నాయకులను, కార్యకర్తలను బయ్యారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ.. బయ్యారం పోలీస్ స్టేషన్ లో ప్రతిపక్ష నాయకులు నిరసన తెలిపారు. కేటీఆర్ పర్యటన వల్ల తమను అన్యాయంగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమను వెంటనే విడుదల చేయాలని అందోళన చేపట్టారు.