ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న ఆర్టీసీ బస్సులు

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న ఆర్టీసీ బస్సులు

భాగ్యనగరంలో రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతుంది. ఇరుకైన రోడ్లు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనతో హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. దీంతో అటు ట్రాఫిక్తో వాహనదారులు, ఇటు ట్రాఫిక్ను కంట్రోల్ చేయలేక పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ట్రాఫిక్ జామ్కు ముఖ్యమైన కారణాలు రూల్స్ను బ్రేక్ చేయడమే. రూల్స్ పాటిస్తే ట్రాఫిక్ జామ్లు తక్కువగా అయ్యే అవకాశం ఉంది. అయితే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనాల్లో బస్సులదే అగ్రస్థానం. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు రూల్స్ను అతిక్రమిస్తూ ట్రాఫిక్ జామ్లకు కారణమవుతున్నారు. దీంతో రోడ్లపై గంటల తరబడి వాహనాలు బారులు తీరుతుండటంతో వాటిని కంట్రోల్ చేయలేక ట్రాఫిక్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. 

రూల్స్ బ్రేక్ చేస్తున్న ఆర్టీసీ బస్సులు

టీఎస్‌ఆర్టీసీ బస్సులు రోడ్లపై నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. నగరాలు, జిల్లాలు, రాష్ట్రాల అనే తేడా లేకుండా యథేచ్ఛగా రూల్స్ బ్రేక్ చేస్తూ కేసుల బారిన పడుతున్నాయి. ముఖ్యంగా నగరంలో ఆర్టీసీ బస్సులు ఫ్రీ లెఫ్ట్ బ్లాక్‌ చేస్తుండడంపై  పోలీసులు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. దీంతో జనవరిలో  స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి...రూల్స్ బ్రేక్ చేసిన ఆర్టీసీ బస్సులపై కేసు నమోదు చేశారు. మొత్తం 3,892 ఆర్టీసీ బస్సులపై కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కలు జనవరి నెలలోనే నమోదవ్వడం గమనార్హం. బస్సులు బస్టాప్‌లు, బస్‌ బేలు ఉన్న చోట కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ నడిరోడ్లపై రూల్స్‌ ఆపుతూ.... ట్రాఫిక్‌ జామ్‌లకు కారణమవుతున్నాయి

సిగ్నల్స్ వద్ద దారుణ పరిస్థితులు..

రద్దీ సమయాల్లో సిగ్నల్స్ వద్ద పరిస్థితి దారుణంగా తయారవుతోంది.  ప్రైవేట్ వెహికిల్స్, ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్ లేన్లను అతిక్రమిస్తున్నాయి. దీంతో వాటి వెనుక  ఇతర వాహనాలు బారులు తీరుతున్నాయి. ముఖ్యంగా మోనప్ప జంక్షన్ నుంచి ఖైరతాబాద్ వీవీ విగ్రహం జంక్షన్, అంబేడ్కర్ విగ్రహం జంక్షన్, పంజాగుట్ట జంక్షన్ వరకు చాలా రోడ్డు కూడళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది.  హైదరాబాద్, సైబరాబాద్,రాచకోండ కమీషనరేట్ల పరిధిలోని అనేక జంక్షన్లలో ఫ్రీ లెఫ్ట్ కోసం బారికేడ్లను ఏర్పాటు చేసినప్పటికీ..బస్సులు, ఇతర వాహనాలు రూల్స్ బ్రేక్ చేస్తున్నాయి. 

అవగాహన కార్యక్రమాలు ..

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న  ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టి అవగాహన కల్పించారు. ఫ్రీ లెఫ్ట్, స్పీడ్, రాష్ డ్రైవింగ్, స్టాప్ లైన్, జీబ్రా లైన్, క్యారేజ్ వేపై ఆగడం, బస్ బేలో ఆగడం వంటి నిబంధనలపై అవగాహన కల్పిచారు. ఇప్పటి వరకు 80 రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ తరగతులను నిర్వహించారు. ఈ తరగతుల్లో సుమారు 4,300 మంది ఆర్‌టిసి సిబ్బందికి  సమగ్ర రహదారి భద్రతా పరిజ్ఞానంతో పాటు ట్రాఫిక్ చట్టాలు, నిబంధనల గురించి వివరించారు.