గవర్నమెంట్​ స్కీంలు తీసుకుంటూ బీజేపీలో ఎందుకున్నవని నిలదీసిన బాజిరెడ్డి

గవర్నమెంట్​ స్కీంలు తీసుకుంటూ బీజేపీలో ఎందుకున్నవని నిలదీసిన బాజిరెడ్డి

సిద్దిపేట, వెలుగు: బీజేపీ వాళ్లకు వచ్చిన కల్యాణలక్ష్మి చెక్కును ఇవ్వకుండా పక్కన పెట్టేశానని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వ్యాఖ్యలు చేశారు. గవర్నమెంట్ పథకాలు తీసుకుంటూ బీజేపీలో ఉండటం ఏంటని నిలదీశానని అన్నారు. శుక్రవారం దుబ్బాక మార్కెట్ యార్డు ఏఎంసీ పాలక మండలి ప్రమాణస్వీకార కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ‘‘నిన్ననే మా నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి చెక్కులు పంచుతా ఉంటే మావోళ్లు వచ్చి ఓ చెక్కు ఆపమన్నరు. ఎందుకని అడిగితే.. ‘అది బీజేపోళ్లది’ అన్నరు. అందుకే పక్కన పెట్టాశా. ఆ బీజేపీ కార్యకర్త భార్య వచ్చి ‘అన్నా నా చెక్కు రాలేదు’ అని అడిగింది. ఆమె భర్త పేరు అడిగి.. ‘నీకు చెక్కు ఇయ్యం’ అని సాఫ్ సీదా చెప్పేశా. అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్త వచ్చి అడిగితే.. ఎందుకియ్యాల ఇయ్యనన్న’’ అని అన్నారు. ‘మీ అమ్మకు పెన్షన్ వస్తుందా’ అని అడిగితే వస్తుందన్నాడని, ‘నీ భార్య బీడీ కార్మికురాలు కదా పెన్షన్ వస్తుందా’ అని అడిగితే వస్తుందని చెప్పాడని.. ‘‘సిగ్గు లేదా.. రెండు పెన్షన్లు దొబ్బుతున్నవు. కల్యాణ లక్ష్మి చెక్కు తీసుకపోయ్యేందుకు వచ్చినవు. మళ్లీ బీజేపీ అంటవు. అందులో ఎందుకున్నవు” అని ప్రశ్నించానని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఇంత లబ్ధి పొందుతున్నప్పుడు కొంచెం కూడా ఇమానం లేదా అని నిలదీశానని అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్​ఎస్​ ఓడటం దురదృష్టకరమన్నారు. ‘‘హరీశ్ లాంటి వ్యక్తి ఉన్న చోట ఆపోజిట్ వ్యక్తికి డిపాజిట్ పోవాలి. కానీ వాన్ని గెలిపిస్తం.. ఇక్కడ పని తీసుకుంటామనడం కరక్టు కాదు. హరీశ్‌రావు ఎప్పుడూ ఓడే వ్యక్తి కాదు.. గెలిచే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు సంతోషంగా బీఆర్ఎస్ వ్యక్తిని గెలిపించాలి” అని కోరారు. ఇక్కడి స్కీమ్​లు చూసి మహారాష్ట్రలోని 40 మంది సర్పంచ్​లు వచ్చి రాష్ట్రంలో కలపాలని అడిగారని చెప్పుకొచ్చారు.

కేసీఆర్ సముద్రాన్ని సృష్టించిండు: మంత్రి నిరంజన్​రెడ్డి

చుక్క నీరు లేని ప్రాంతంలో సీఎం కేసీఆర్​సముద్రాన్ని సృష్టించారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను, అభివృద్ధి నమూనాను అందిస్తున్న కేసీఆర్.. ​పాఠాలు నేర్చుకున్నది దుబ్బాకలోనేనని తెలిపారు. ఒకప్పుడు దుబ్బాక ప్రాంతం తాగునీటి కోసం అష్టకష్టాలు పడిందని, గాలొస్తే కూడవెల్లి వాగులో దుమ్ము మాత్రమే కనిపించేదని, అలాంటి వాగును కాళేశ్వరం నీళ్లతో నింపిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.