మా డిమాండ్లకు కట్టుబడి ఉన్నం: అశ్వత్థామరెడ్డి

మా డిమాండ్లకు కట్టుబడి ఉన్నం: అశ్వత్థామరెడ్డి

హైదరాబాద్, వెలుగు: తాము చేసిన డిమాండ్లకు కట్టుబడి ఉన్నామని, వాటన్నింటినీ మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్​ అశ్వత్థామరెడ్డి తెలిపారు. సర్కారుకు ఆర్టీసీ నుంచి రావాల్సిన ఫండ్స్​గురించి కోర్టులో చర్చ జరిగిందని చెప్పారు. సోమవారం హైకోర్టులో విచారణ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగు డిమాండ్లు నెరవేరుస్తామని, అందుకు రూ. 47 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం చెప్తోందన్నారు. ఆ నాలుగు డిమాండ్లే కాదు.. అన్ని డిమాండ్లపైనా చర్చించాలని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. బస్ పాస్​ రాయితీల సొమ్ము రూ.1,099 కోట్లు, మున్సిపల్​ యాక్ట్​ కింద రూ. 1,300 కోట్లు, ప్రభుత్వం నుంచి రూ.2,276 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. చర్చలు జరుపుతుండగా తాము బయటికొచ్చామన్న సర్కారు వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు. మరింత సమాచారం కోసం సమయం కావాలని అడ్వొకేట్​ జనరల్​ కోరారని, దాంతో కోర్టు మంగళవారం మధ్యాహ్నానికి విచారణను వాయిదా వేసిందని చెప్పారు.

సాగదీయొద్దు
చర్చల ప్రక్రియను పొడిగించొద్దని సీఎం​ను కోరుతున్నామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. అన్ని డిమాండ్లపై చర్చించాల్సిందేనని స్పష్టం చేశారు. పోరాటాలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, కార్మికులందరికీ న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు. కార్మికులెవరూ అధైర్యపడొద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.