కోర్టు ఆర్డర్​ ​వచ్చినప్పుడల్లా ఫాంహౌస్​కు కేసీఆర్

కోర్టు ఆర్డర్​ ​వచ్చినప్పుడల్లా ఫాంహౌస్​కు కేసీఆర్
  •  కోర్టు చెప్పినా లెక్కలేదు
  • ఆర్టీసీ ఆస్తులతో రియల్​ ఎస్టేట్​ వ్యాపారానికి కుట్ర
  • చర్చలకు ప్రభుత్వమే పిలిచే రోజు వస్తది: అశ్వత్థామరెడ్డి
  • ఆర్టీసీ ఆస్తులను అమ్ముకునేందుకే విలీనం చేస్తలేరు: కోదండరాం
  • సమ్మెతో కేసీఆర్ పీఠం కదులుతోంది : ఎల్‌.రమణ
  • ఎంజీబీఎస్‌లో ధర్నా

హైదరాబాద్‌, వెలుగు:

చర్చలు జరపాలని కోర్టు చెప్పినా సీఎం కేసీఆర్​ పట్టించుకోవడం లేదని, కోర్టు ఆర్డర్​ ఇచ్చినప్పుడల్లా ఆయన ఫామ్​హౌస్​కు పోతున్నారని, ఇటువంటి పరిపాలన అవసరమా అని ప్రజలందరూ ఆలోచిస్తున్నారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్​ అశ్వత్థామరెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్​ అనుకోవచ్చు.. ఇంకా నాలుగేండ్లు అధికారం ఉందని, ఎవరూ ఏం చేయలేరని. కార్మికుల పోరాటం కేసీఆర్​ పతనానికి బీజం వేసింది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా రవాణాను, ప్రజల ఆస్తులను కాపాడుకునేందుకే పోరాటం చేస్తున్నామని, తమ స్వార్థ ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా సోమవారం ఎంజీబీఎస్‌లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి టీజేఎస్​ చీఫ్​ కోదండరాం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరు హాజరై మద్దతు తెలిపారు. పోలీసులు భారీగా మోహరించారు.

ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ‘‘నీ పార్టీ కార్యకర్తలకు, నీ కుటుంబ సభ్యులకు, నీ బంధుమిత్రులకు ఆర్టీసీ ఆస్తులు అమ్ముతున్నవ్​. ఇది మా కార్మికుల రక్త మాంసం, చెమట. ఇవి ప్రజల ఆస్తులు. వేల కోట్ల ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నవ్. ఆర్టీసీ ఆస్తులతో రియల్​ఎస్టేట్​ వ్యాపారం చేయాలని చూస్తున్నవ్​” అని సీఎంపై మండిపడ్డారు. ప్రభుత్వమే చర్చలకు పిలిచే రోజు వస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ కార్మికుల ఒళ్లంతా తూట్లు పొడిచారని, ముళ్లు గుచ్చారని, ఆ ముళ్లు తీసే భాగంలోనే సమ్మె నోటీస్ ఇచ్చామని ఆయన తెలిపారు. ఆర్టీసీ సమస్యలపై పోరాడాల్సిన దుస్థితి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కల్పించిందన్నారు.

జీతాలు చెల్లించకుండా కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. కార్మిక లోకమంతా కదిలిందని, అన్ని పార్టీలు జెండాలు పక్కన బెట్టి మద్దతు తెలుపుతున్నాయని పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వుల కాపీ సీఎం కేసీఆర్‌కు చేరి ఉండవచ్చని, చర్చలకు పిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజా రవాణా సౌకర్యవంతంగా జరగాలంటే కార్మికులను చర్చలకు పిలవాలన్నారు. ఇప్పటికే దసరా పోయిందని, దీపావళి పండుగైనా కార్మికులు సుఖసంతోషాలతో జరుపుకొనేలా చూడాలని సూచించారు.

కోర్టు ఆదేశాలూ పట్టవా?: ఎల్‌.రమణ

ఆర్టీసీ కార్మికులకు జరుగుతున్న అన్యాయానికి అందరూ అండగా ఉండాలని, న్యాయం చేసే వరకు పోరాటం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ అన్నారు. కోర్టు ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో కేసీఆర్ పీఠం కదిలే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్ బేషజాలకు పోకుండా చర్చలకు పిలవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

వందేండ్లు తపస్సు చేసినా వందశాతం నడపలేరు: చాడ

ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకున్నా, సీఎం కేసీఆర్‌కు కొంచెమైనా కనికరం, మానవత్వం ఉండదా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ వందేండ్లు తపస్సు చేసినా వంద శాతం బస్సులు నడపలేరని ఆయన ఎద్దేవా చేశారు. ఆర్టీసీ నిజాం కాలంలో కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని, మధ్యలో మాత్రమే కార్పొరేషన్‌ అయిందని, వెంటనే సర్కార్‌లో విలీనం చేయాలని డిమాండ్​ చేశారు.

ఆర్టీసీ ఆస్తులు అమ్ముకునే కుట్ర: కోదండరాం

ఏపీఎస్‌ ఆర్టీసీలో ఎక్కువ అప్పులున్నా అక్కడి సర్కార్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిందని, టీఎస్​ ఆర్టీసీలో తక్కువ అప్పులున్నా ఎందుకు చేయడం లేదని టీజేఎస్‌ చీఫ్​ కోదండరాం ప్రశ్నించారు. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడి ప్రభుత్వం విలీనం చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం చర్చలకు పిలిచి, సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా లేదని, ఆఖరికి కోర్టు ఆదేశాలను కూడా బేఖాతర్‌ చేస్తోందన్నారు. కోర్టులను అగౌరవ పరచడం మంచి పరిణామం కాదని హితవుపలికారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సమ్మె విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం పుకార్లు లేపుతోందని, వాటిని ఎవరూ నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

RTC Dharna at Gandhi statue in MGBS, as part of RTC strike