సన్నిహితుల వద్ద టీఆర్ఎస్ నేతల కామెంట్స్
పిలిచి మాట్లాడితే సాల్వ్ అయ్యేటిది
ఇయ్యాల ఓ కార్మికుడి చావుకు కారణమయ్యిన్రు
ఎక్కడ, ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో తెలుస్తలేదని వ్యాఖ్యలు
ఆర్టీసీపై ప్రజల్లో వ్యతిరేకత లేదు
‘‘తొలి రెండు రోజులు ఆర్టీసీ కార్మికులను ప్రజలు తప్పుపట్టారు. కానీ సంస్థలో కొన్ని రూట్లను ప్రైవేటు చేస్తామని చెప్పగానే ఆర్టీసీపై కోపం పోయి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది’’ అని ప్రభుత్వంలోని
ఓ సీనియర్ అధికారి చెప్పారు.
ప్రస్తుతం సమ్మెకు ఎలా ఫుల్ స్టాప్
పెట్టాలనే విషయంపై సీఎం ఆలోచన చేస్తున్నారని చెప్పారు.
ఇది నిరంకుశ వైఖరి. ప్రజాస్వామ్యంలో ఎవరైన ఇట్ల చేస్తరా? ఉమ్మడి రాష్ట్రంలో కూడ చేయలే. కూర్చోని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యేటిది కదా. సార్ మొండిపట్టుదల ఇయ్యాల ఓ కార్మికుడి చావుకు కారణమయ్యింది. సార్ తీరు చూస్తుంటే.. ప్రభుత్వ పతనానికి నాంది పలికినట్టే కనిపిస్తంది.
– టీఆర్ఎస్లో ఓ సీనియర్ నేత కామెంట్
ఉద్యమంల టీఎంయూ సంస్థను మేమే ఎంకరేజ్ చేసినం. బస్డాండ్ల ముందు ధర్నాలో పాల్గొన్నం. పాటలు పాడినం. ఇయ్యాల ఆర్టీసీ కార్మికులను అణచేస్తంటే బాధ అయితంది. ఓ డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం
గుండెను పిండేస్తంది
– ఉద్యమ సమయం నుంచి
పార్టీలో ఉన్న ఓ నాయకుడి ఆవేదన
టీఆర్ఎస్ పుట్టక ముందు నుంచే చాలా కార్మిక సంఘాలకు నాయకుడిగా ఉండిన. కానీ ఏ సీఎం ఇట్ల చేయలే. సార్ తొందర పడ్డడు. కాస్త ఆలోచిస్తే బాగుండు. కానీ జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పుడు ఫుల్ స్టాప్ ఎట్ల పెట్టాల్నో తెలుస్తలేదు. డ్రైవర్ ఆత్మహత్యతో పరిస్థితి మరింత పట్టుదప్పింది.
– టీఆర్ఎస్ లోని ఓ నేత ఆందోళన
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులతో కలిసి టీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారు. కానీ ప్రస్తుతమున్న పరిస్థితులను చూసి గులాబీ నేతలు ఆవేదన చెందుతున్నారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని టీఆర్ఎస్ లోని మెజార్టీ నేతలు అంతర్గత సమావేశాల్లో తప్పుపడుతున్నారు. ‘సార్ తొందర పడ్డరు. పిలిచి మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయ్యేది’ అని అంటున్నారు. అయితే ఆ విషయాన్ని బయటికి చెప్పలేకపోతున్నారు. సీఎం తీరును తప్పుపడుతున్న వారిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఉన్నారు. ఏదైన పని కోసం మంత్రులు, ఎంపీల ఇంటికి వెళ్లే నాయకులతో, సమావేశాల్లో పరస్పరం ఎదురైన నేతలతో దీనిపైనే చర్చించుకుంటున్నారు.
అప్పుడే మాట్లాడితే పోయేటిది..
కార్మికులపై సీఎం ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదని, ప్రస్తుత పరిస్థితుల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని టీఆర్ఎస్ నేతలు ఆవేదన చెందుతున్నారు. ఉద్యమ సమయంలో ఆంధ్రా ఉన్నతాధికారులను ఎదిరించి కార్మికులు సకల జనుల సమ్మెలో భాగస్వాములయ్యారని చెబుతున్నారు. సమ్మె నోటీసు ఇచ్చినప్పుడే వారిని నేరుగా పిలిచి మాట్లాడితే బాగుండేదని అంటున్నారు. ప్రభుత్వంలో విలీనంపై ఓ ఎక్స్‌పర్ట్ కమిటీ వేసి స్టడీ చేసుంటే కార్మికులు కూడా కొంత మేర సంతృప్తి చేందేవారని ఓ సీనియర్ నేత అన్నారు. రెండోసారి కేసీఆర్ సీఎం అయ్యాక ఉద్యోగులు, కార్మికుల విషయంలో ఆయన తీరు మారిందని చెప్పారు. ఉద్యమ సమయంలో కార్మికుల మద్దతు తీసుకుని ముందుకు వెళ్లామని అప్పుడు చెప్పి… ఇప్పుడు వాళ్లను శత్రువులుగా చూడటం బాధగా ఉందని మరో సీనియర్ నేత అన్నారు.
టీఎంయూలో టీఆర్ఎసోళ్లే
గౌరవ అధ్యక్షులుగా ఉండేటోళ్లు
‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీలో టీఆర్ఎస్కు పెద్దగా మద్దతు ఉండేది కాదు. ఈ విషయాన్ని గుర్తించిన కేసీఆర్.. ఆర్టీసీలో పాగా వేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. కేసీఆర్ వల్లే ఎన్ఎంయూ చీలింది. టీఎంయూ ఏర్పడి హరీశ్‌రావు గౌరవ అధ్యక్షుడయ్యారు. తెలంగాణ వచ్చాక కూడా హరీశ్ కొన్నాళ్లు టీఎంయూ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత సీఎం ఆదేశం మేరకు రాజీనామా చేశారు’’ అని హైదరాబాద్ కు చెందిన ఓ సీనియర్ నేత వివరించారు. కార్మిక సంఘం నేతలు.. ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రి హరీశ్‌రావును కలిసే ప్రయత్నం చేశారని, ఆయన మాత్రం ఏం చేస్తారని తెలిపారు. ఉద్యమ సమయంలో ప్రతి డిపో టీఎంయూ సంఘానికి టీఆర్ఎస్ నాయకులే గౌరవ అధ్యక్షులుగా ఉండేవారని, తాజా పరిస్థితులపై వారంతా ఆవేదన చెందుతున్నారని చెప్పారు. ‘‘రెండోసారి మేం అధికారంలోకి వచ్చాక అపోజిషన్‌కు ఇష్యూలు లేవు. ఆర్టీసీ సమ్మె విషయంలో మా సార్ తీసుకున్న నిర్ణయం వాళ్లకు వెపన్ అయ్యింది’’ అని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ నేత అన్నారు.

