
52 రోజుల సమ్మె.. ఆవేదనతో ఆత్మహత్యలు.. ఏం జరుగుతుందో అనే మనస్తాపంతో ఆగిన గుండెలు.. ఆర్టీసీ పరిరక్షణే ధ్యేయంగా రోడ్డెక్కిన కార్మిక కుటుంబాలు.. కడుపు కాలుతున్నా మొక్కవోని ధైర్యంతో క్షణక్షణం ఉద్యమంలోనే.. రక్తం వచ్చేలా కొట్టినా తగ్గని పోరాట పటిమ.. రెండు నెలలుగా జీతం ఇయ్యకుండా ఇబ్బంది పెట్టినా వెరవని వెన్ను.. చరిత్రలో నిలిచిన సమ్మె.. ప్రభుత్వ బెదిరింపులు, హెచ్చరికలు.. హైకోర్టు అసహనం, ఆగ్రహం, మండిపాటు.. వాయిదాల మీద వాయిదాలు.. చివరికి లేబర్ కోర్టుకు చేరిన సమస్య.. ప్రభుత్వం నుంచి కానరాని స్పందన.. ఆఖరికి ఆర్టీసీ సమ్మె విరమణ.. ఇదీ ఆర్టీసీ సమ్మె సాగిన తీరు. –హైదరాబాద్, వెలుగు
కోర్టులో వాయిదాలే వాయిదాలు
సమ్మె ప్రారంభమైన అక్టోబర్ 5వ తేదీ నుంచి హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతూనే ఉన్నాయి. సెప్టెంబర్ నెల జీతం ఆగిపోవడం, రూట్ల ప్రైవేట్ పరం తదితర అంశాలపై పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై వాదనలు, విచారణ కొనసాగాయి. ఈ సమయంలో సర్కార్, అధికారుల తీరుపై కోర్టు తీవ్రంగా మండిపడింది. ‘‘ఆర్టీసీపై తప్పుడు లెక్కలేంది. తమాషానా? బకాయిలపై మంత్రికి ఒక లెక్క.. మాకో లెక్క చెప్తరా? కోర్టులతో ఆటలాడొద్దు. పర్యవసానాలు ప్రభుత్వానికి తెలియవా? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు?’’ అని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలా ఒకట్రెండు సార్లు కాదు.. ఆర్టీసీ సమ్మె విషయంలో కోర్టు విచారణ జరిగిన ప్రతిసారీ రాష్ట్ర ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు మొట్టికాయలు పడ్డాయి. కోర్టు నుంచి అనుకూల వ్యాఖ్యలు రావడం కార్మికుల్లో ధీమా పెంచింది. కోర్టులో ప్రభుత్వ అధికారులు, ఆర్టీసీ ఆఫీసర్లు అబాసుపాలు అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, ఆర్టీసీ ఉన్నతాధికారులు స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ప్రతి సారి కోర్టులో కార్మికులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో కార్మికుల్లో ధైర్యం పెరిగింది. కానీ చివరికి ఎటూ తేల్చక లేబర్ కోర్టుకు రిఫర్ చేయడం గమనార్హం. అంతేకాకుండా రూట్ల ప్రైవేట్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
స్టాండ్ మారలే
సమ్మె మొదలైనప్పటి నుంచి సర్కార్ ఒకే స్టాండ్‌పై నిలబడింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి సోమవారం దాకా ఒకే మాటపై ఉంది. ‘సమ్మె ఇల్లీగల్. ఆర్టీసీ విలీనం ప్రసక్తే లేదు. చర్చలుండవు’ అని కోర్టు విచారణ జరిగిన ప్రతిసారి ప్రభుత్వం కోర్టులో ఇదే స్టాండ్ తీసుకుంది. కోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా, ఆఖరికి సీఎస్, రవాణ శాఖ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు స్వయంగా హాజరుకావాలని ఆదేశించినా ఎక్కడా తగ్గలేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలతో కమిటీ వేస్తామన్నా ఒప్పుకోలేదు. విలీనం డిమాండ్ వదులుకుంటున్నామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించినా తగ్గలేదు. ఆఖరికి ఎలాంటి షరుతులు లేకుండా విధుల్లో చేరుతామన్నా వినిపించుకోలేదు.
రూట్ల ప్రైవేట్..
కార్మికులు సమ్మె చేయడంతో సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో రూట్లను ప్రైవేట్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. 5,100 రూట్లను ప్రైవేట్ చేయాలని ఏకంగా మంత్రివర్గంలో నిర్ణయించారు. దీనిపై హైకోర్టు సైతం క్లియరెన్స్ ఇచ్చింది. అంతేకాకుండా 50, 30, 20 శాతంలో ప్రైవేట్, అద్దె , ఆర్టీసీ బస్సులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇక సమ్మె మధ్యలోనే 1,200 అద్దె బస్సులకు ఆర్టీసీ నోటిఫికేషన్ వేసింది.
సమ్మె విచ్ఛిన్నానికి ప్రయత్నం చేసినా..!
సమ్మె ఉధృతంగా మారడం, విజయవంతంగా నడుస్తుండటంతో సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు సర్కార్ అన్ని ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా ఆర్టీసీ సంఘాలను చీల్చే ప్రయత్నం కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దింపింది. సమ్మెను విరమించి విధుల్లో చేరాలని బలవంతపెట్టిచ్చింది. జిల్లాల్లో డిపో స్థాయి నేతలను భయపెట్టి, ఆశచూపి సమ్మెను ఆపాలని చూశారు. కానీ ఏ ఒక్కరూ సర్కార్ కుట్రలకు తలొగ్గలేదు.
ఆత్మహత్యలు.. ఆగిన గుండెలు..
ఆర్టీసీ సమ్మె జరుగుతున్న సమయంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఉరేసుకుని, పురుగుల మందు తాగి, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొందరు ఏం జరుగుతుందో అనే మనస్తాపంతో గుండె ఆగి చనిపోయారు. మొత్తంగా 30 మంది కార్మికులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇందులో మహిళా కార్మికులు కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఖమ్మం జిల్లాకు చెందిన కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి పెట్రోల్ పోసుకుని ఆత్మబలిదానానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని డీఆర్‌డీఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. నేతలు ఖమ్మం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో సమ్మె ఉధృతంగా మారింది. తర్వాత కూడా కార్మికులు ఆత్మహత్యలు, గుండెపోటుతో చనిపోవడం ఆగలేదు. కరీంనగర్‌కు చెందిన బాబు అనే డ్రైవర్ హైదరాబాద్‌లో సకల జనుల సభ జరుగుతుండగా అక్కడే ప్రాణాలు వదిలారు. కరీంనగర్ బంద్‌కు నేతలు పిలుపునిచ్చారు. డిమాండ్లు నెరవేర్చే వరకు బాబు భౌతికకాయం తీయబోమని భీష్మించారు. దీంతో కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందులో భాగంగా జరిగిన తోపులాటలో పోలీసులు ఎంపీ బండి సంజయ్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. హైదరాబాద్‌కు చెందిన సురేందర్ గౌడ్, సత్తుపల్లికి చెందిన నీరజతోపాటు ఎందరో కార్మికులు చనిపోయారు.
లాఠీలకు ఎదురొడ్డి..
సమ్మెలో భాగంగా నవంబర్ 9వ తేదీన ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమాన్ని చేపట్టింది. చలో ట్యాంక్‌బండ్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టించింది. మూడెంచెల భద్రత ఏర్పాటు చేసింది. భారీగా పోలీసుల మోహరించింది. అయినప్పటికీ నలువైపుల నుంచి ట్యాంక్‌బండ్‌పైకి కార్మికులు దూసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేశారు. కార్మికులపై లాఠీచార్జ్ చేశారు. లాఠీలు విరిగేలా కొట్టారు. కొందరు కార్మికులు తలలు పగిలిపోయాయి. దీంతో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. వాళ్లు కార్మికులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రతిక్షణం టెన్షన్ టెన్షన్‌గా జరిగిపోయింది. నాటి తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టంగా పేర్కొనే మిలియన్ మార్చ్‌ను తలపించింది. ఆఖరికి చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం విజయవంతమైంది. కార్మికులకు తోడు అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక, విద్యార్థి సంఘాలు మద్దతుగా ట్యాంక్ బండ్‌కు తరలొచ్చాయి.
అహింసా మార్గంలోనే ఉద్యమం..
52 రోజులు ఆర్టీసీ సమ్మె మొత్తం అహింసా మార్గంలో జరిగిందని చెప్పవచ్చు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమ్మె చేశారు. ప్రతీ విషయంలో సంయమనం పాటించారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు కవ్వింపు చర్యలకు పాల్పడినా కార్మికులు సహనం కోల్పోలేదు. కానీ ఎక్కడా అహింసా మార్గంలోకి వెళ్లలేదు. సకల జనుల సమరభేరీ, ఛలో ట్యాంక్‌బండ్, రాష్ట్ర బంద్‌లాంటి పెద్ద కార్యక్రమాల్లోనూ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి.
సకలజనుల సమర భేరి సభ..
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా అక్టోబర్ 30వ తేదీన ఆర్టీసీ జేఏసీ, అఖిల పక్షం ఆధ్వర్యంలో సకలజనుల సమరభేరి సభను నిర్వహించారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా సభ జరిగింది. దీనికి అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజా, కుల, విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు నేతలు హాజరయ్యారు. సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో జేఏసీ నేతలు కోర్టు నుంచి షరతులతో అనుమతి తెచ్చుకున్నారు. సభకు కార్మికులు భారీగా హాజరయ్యారు. ఈ సభలోనే కరీంనగర్‌కు చెందిన డ్రైవర్ బాబు గుండె ఆగి చనిపోయారు.
హెచ్చరికలు బేఖాతర్
సమ్మెకు ముందు సీఎం కేసీఆర్ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సుదీర్ఘంగా చర్చించాక త్రీమెన్ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ చర్చలు జరిపినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత అక్టోబర్ 4వ తేదీన సమీక్ష నిర్వహించారు. 5వ తేదీ లోగా అందరూ రిపోర్ట్ చేయాలని హెచ్చరించారు. ఆర్టీసీ కథ ముగిసింది. అది మునగక తప్పదు. దాన్ని ఎవరూ కాపాడలేదు. ‘కార్మికులు రోడ్డున పడితే పడుండ్రు. ఎవరేం చేస్తరు. అమాయకులైతే జాయినింగ్ అప్లికేషన్ పెట్టుకోవాలె. ఒక్క సంతకంతో 7వేల ప్రైవేట్ బస్సులు కొంటం. భూగోళం ఉన్నంత కాలం విలీనం జరగదు. హైకోర్టు ఏం చేస్తది కొడ్తదా..’ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ భయపెట్టించినా పదుల సంఖ్యలోనే కార్మికులు రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత కూడా అనేకసార్లు మంత్రులు, రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులతో సీఎం సమీక్షలు జరుపుతూ వచ్చారు. మధ్యలో ఎన్ని హెచ్చరికలు చేసినా కార్మికులు వెనక్కి తగ్గలేదు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఇన్‌చార్జి ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ అయితే నిత్యం ఇదే పనిలో నిమగ్నమయ్యారు.
అన్ని వర్గాల మద్దతు
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సబ్బండ వర్గాల నుంచి మంచి మద్దతు లభించింది. టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ప్రత్యక్ష్యంగా ఉద్యమంలో కూడా పాల్గొన్నాయి. ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు, కళాకారులు, ఉద్యోగ, విద్యార్థి, యువజన, కార్మిక, కర్షక సంఘాలూ కార్మికుల మద్దతు తెలిపాయి. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఓలా, ఉబర్ క్యాబ్‌లతో పాటు ప్రైవేట్ టాక్సీలు కూడా ఒక రోజు సమ్మె చేపట్టాయి.