90% బస్సులు తిప్పితే పైసలు ఏమైనయ్​

90% బస్సులు తిప్పితే పైసలు ఏమైనయ్​
  • ఎవరి ఖజానాకు మళ్లించారు
  • కార్మికుల జీతాలపై  కోర్టును తప్పుదోవ పట్టించారు
  • జీతాలకు రూ. 105 కోట్లయితే రూ. 239 కోట్లని చెప్పుడేంది?
  • మా నేతలతో టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల బేరసారాలు
  • అద్దె బస్సుల టెండర్‌ రద్దు చేయాలి
  • లాకౌట్‌ చేయడానికి సంస్థ ఎవరి జాగీర్‌ కాదు: అశ్వత్థామరెడ్డి
  • రాష్ట్ర సర్కార్​ తీరుపై గవర్నర్​కు ఆర్టీసీ జేఏసీ ఫిర్యాదు

హైదరాబాద్‌, వెలుగు:

ఆర్టీసీలోని డబ్బులు ఎటుపోయాయని, ఎవరి ఖజానాకు మళ్లించారో సంస్థ అధికారులు లెక్కలు బయటపెట్టాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్​ అశ్వత్థామరెడ్డి డిమాండ్‌ చేశారు. రోజూ 90 శాతం బస్సులు నడుస్తున్నాయని రాష్ట్ర సర్కార్‌ చెబుతోందని, దీన్ని బట్టి చూసినా రోజుకు సగటున రూ. 13 కోట్ల వరకు ఆదాయం రావాలని, మరి ఆ డబ్బులు కూడా ఎక్కడికి పోయాయో ప్రభుత్వం, యాజమాన్యం చెప్పాలన్నారు. సెప్టెంబర్‌ జీతాలకు సంబంధించి రూ. 105 కోట్లు కూడా ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల జీతాలకు రూ. 239 కోట్లు కావాలంటూ ప్రభుత్వం హైకోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చిందని, నెట్‌ పేమెంట్  రూ. 105 కోట్లు మాత్రమేనని, కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను ఆర్టీసీ జేఏసీ నేతలు కలిశారు. సమ్మె డిమాండ్లపై నివేదిక అందజేశారు. అనంతరం అశ్వత్థామ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేసేలా సీఎం తీసుకుంటున్న నిర్ణయాలని ఆపాలని గవర్నర్​ను కోరినట్లు తెలిపారు. సమ్మె నోటీస్‌ ఉన్నప్పుడు, బోర్డు అనుమతి లేకుండా అద్దె బస్సులకు టెండర్‌ నోటిఫికేషన్‌ వేశారని, దాన్ని రద్దు చేయాలని కోరినట్లు చెప్పారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని గవర్నర్‌ కోరారని అశ్వత్థామరెడ్డి తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడుతానని చెప్పారని వివరించారు. సీఎం కేసీఆర్‌  కోర్టు ఆర్డర్‌ కాపీ అందలేదని కారణం చెబుతూ ఉద్దేశపూర్వకంగా చర్చలపై కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

లక్ష, రెండు లక్షలిస్తమని ప్రలోభాలు

టీఆర్‌ఎస్​ ఎమ్మెల్యేలు తమ డిపో నేతలతో రూ. లక్ష ఇస్తామని, రెండు లక్షలు ఇస్తామని, డ్యూటీలో చేరాలని ప్రలోభ పెడుతున్నారని అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు. ఓ ఎమ్మెల్యే కాల్ రికార్డు తమ వద్ద ఉందని, ఆ ఎమ్మెల్యేకు ఇది పద్ధతి కాదని హితవు పలికారు. కేవలం ఎమ్మెల్యేలు తమ పబ్బం గడుపుకోవడానికే ఇలా చేస్తున్నారని, ఇలాంటి చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఆర్టీసీని బతికించుకోవడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.  ఆర్టీసీ ఆస్తులపై కన్నేసి, ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

లాకౌట్‌ చేయడానికి ఎవరి జాగీర్‌ కాదు

ఆర్టీసీని లాకౌట్‌ చేయడానికి ఎవరి జాగీర్‌ కాదని అశ్వత్థామరెడ్డి ధ్వజమెత్తారు. రాజ్యాంగ చట్టాలకు లోబడి ఉందని, ఇంటిలో చట్టాలు తయారు చేసినట్లు కాదని, అన్‌ ఆర్గనైజ్డ్‌ సెక్టార్‌లో పనిచేసే వారినే తీసేయడానికి అధికారం ఉండదన్నారు. లాకౌట్‌ అంటే భయపడతామని భ్రమపడుతున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీ ఆస్తుల్ని కార్మికులు రక్తమాంసాలు ధారబోసి సంపాదించారన్నారు. ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ యథావిధిగా అమలవుతందని చెప్పారు. తమ పోరాటాలకు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపున్నామని, భవిష్యత్‌లో చేపట్టే కార్యాచరణకు కూడా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్‌ కావాలనే జాప్యం చేస్తున్నరు : రాజిరెడ్డి

సీఎం కేసీఆర్‌ కావాలనే కార్మికులతో చర్చలు జరపకుండా జాప్యం చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్‌ రాజిరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు గవర్నర్ అండగా ఉన్నారని చెప్పారు. సమ్మెకు దేశవ్యాప్తంగా అందరి సహకారం ఉందన్నారు. జేఏసీ కో కన్వీనర్‌ వీఎస్ రావు మాట్లాడుతూ సమస్యలపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. సింగరేణి కార్మికులను త్వరలో కలుస్తామని ఆయన తెలిపారు. మహిళా జేఏసీ కన్వీనర్ సుధా మాట్లాడుతూ కార్మికులు ఎవరి ప్రలోభాలకు లొంగొద్దని సూచించారు.