- పన్నులు తీసేస్తే లాభాల్లోకి తెస్తం
- సీఎం కేసీఆర్‌పై అశ్వత్థామరెడ్డి ఫైర్
- ప్రజా రవాణాను మాఫియా చేద్దమనుకుంటున్నరు
- ఆర్టీసీ చక్రాలు దూసుకురాకముందే పరిష్కరించండి
- అన్ని డిమాండ్లూ నెరవేర్చాల్సిందే
నాగర్‌కర్నూల్ టౌన్/మహబూబ్‌నగర్/షాద్‌నగర్/హైదరాబాద్, వెలుగు:
‘ఆర్టీసీ ప్రభుత్వరంగ సంస్థని కరీంనగర్ సభలో చెప్పిన మాట మర్చిపోయారా?.. లేక 2013లో నాకు ఫోన్ చేసి ఉద్యమాన్ని 2014 వరకు నడపాలని కోరింది మర్చిపోయారా? తెలంగాణ ఉద్యమంలో వాడుకొని ఇప్పుడు వదిలేయాలని చూస్తారా?’ అని సీఎం కేసీఆర్‌పై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. ‘మొన్న సెల్ఫ్ డిస్మిస్ అంటరు. తర్వాత విలీనం వద్దన్నమని చెప్తరు. ఇవాళ ఏ బాంబు వేసిన బెదరమని అంటరు. అసలు కార్మికులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడే మాటల్లో స్పష్టమైన సమాధానమే లేదు. సిగ్గు, శరం లేకుండా పూటకోమాట మారుస్తున్నారు’ అని విమర్శించారు. ప్రజా రవాణా వ్యవస్థను మాఫియాగా మార్చాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. సెల్ఫ్ డిస్మిస్‌ను కనిపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. గురువారం వివిధ జిల్లాల్లో కార్మికుల దీక్షల్లో పాల్గొని అశ్వత్థామరెడ్డి మాట్లాడారు. ‘యూనియన్లు లేవు, అవి లేవు, ఇవి లేవు అంటారా? యూనియన్లే లేకుంటే రాష్ట్రం వచ్చేదా?’ అని నిలదీశారు. ఆర్టీసీలోని ఈడీల గురించి తమకు తెలుసని.. ఈడీలు, బేడీల కమిటీపై తమకు నమ్మకం లేదని, వాళ్లతో ఏ సమస్యలూ పరిష్కారం కావని అన్నారు. ‘ఇన్ని రోజులు ఈ ఆరుగురు ఈడీలు ఎటు పోయారు? మా సమస్యలు తెలువవా?’ అని మండిపడ్డారు. ట్యాక్సులు రద్దు చేస్తే సంస్థను లాభాల్లోకి తీసుకొస్తామని చెప్పారు.
మున్ముందు పోలీసుల తిరుగుబాటొస్తది
కార్మికుల హక్కుల కోసం సమ్మె చేస్తున్నారని, త్వరలో పోలీసుల తిరుగుబాటు వస్తుందని అశ్వత్థామరెడ్డి చెప్పారు. మహిళా కండక్టర్ల ఉసురు సర్కారుకు తగులుతుందన్నారు. ప్రభుత్వంపైకి ఆర్టీసీ చక్రాలు దూసుకు రాకముందే కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఏ ముఖ్యమంత్రికి వేయనన్ని మొట్టికాయలు కేసీఆర్‌కు హైకోర్టు వేయడం అందరికీ తెలిసిందేనన్నారు. హైదరాబాద్‌లో, పట్టణాలకు బస్సులు నడపడం కాదని, ధైర్యముంటే గ్రామాలకూ నడపాలని అన్నారు. డిమాండ్లలో ఏ ఒక్కటీ విరమించుకోబోమని, అన్నింటినీ పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేశారు. చర్చలకు పిలిస్తే వచ్చేందుకు సిద్ధమని చెప్పారు. ఆర్టీసీని రక్షించుకునేందుకు త్యాగాలకైనా సిద్ధమన్నారు. హుజూర్‌నగర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచిందని కార్మికులు అధైర్యపడొద్దని.. ఎన్నికలకు, ఆర్టీసీకి సంబంధం లేదని, తాము రాజకీయ నేతలం కాదని గుర్తు చేశారు. కేసీఆర్ మాటలు నమ్మొద్దని, పోరాటం ఉధృతంగా మారుతోందని చెప్పారు. అనివార్య కారణాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా రేపటి రాస్తారోకోను వాయిదా వేస్తున్నామని తెలిపారు. స్టూడెంట్ల మద్దతు కోరాలని, హైదరాబాద్‌లో 30న జరగబోయే సభకు అందరూ తరలి రావాలని కోరారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కార్మికుల పక్షాన నిలబడాలని, మంత్రి పదవికి రాజీనామా చేసి సమ్మెకు మద్దతివ్వాలని కోరారు.
ఆర్టీసీ బలహీనమే సర్కారుకు కావాలె: థామస్‌రెడ్డి
ఆర్టీసీని బలోపేతం చేయడంలో సర్కారు విఫలమైందని, అసలు ప్రభుత్వానికి కావాల్సింది కూడా ఇదేనని, ఆర్టీసీని తొక్కి ప్రైవేట్‌ను పైకి తేవాలని చూస్తోందని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ థామస్‌రెడ్డి విమర్శించారు. ఈడీలు బాగా పని చేస్తే ఆర్టీసీకి, కార్మికులకు ఈ సమస్య వచ్చేది కాదని, ఈడీలది పనికిమాలిన కమిటీ అని మండిపడ్డారు. ఏరోజు కూడా తమ సమస్యలపై మీటింగ్ పెట్టిన పాపాన పోలేదన్నారు. సీఎం అబద్ధాలు మాట్లాడుతున్నారని, కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి ధ్వజమెత్తారు. ఆర్టీసీ యూనియన్ల మధ్య విభేదాల్లేవని, కావాలని కేసీఆర్ చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. కార్మికుల వల్లే నష్టం వచ్చినట్లు సీఎం మాట్లాడుతున్నారని, కార్మికులెవరూ రాజకీయం చేయలేదని అన్నారు. సమ్మె తప్పని కోర్టు ఎక్కడా చెప్పలేదన్నారు.

