ఆర్టీసీ సమ్మె కొనసాగింపు

ఆర్టీసీ సమ్మె కొనసాగింపు

ఒకటి రెండ్రోజుల్లో ఫైనల్ నిర్ణయం.. జేఏసీ ప్రకటన

ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై సుదీర్ఘ చర్చల తర్వాత జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ప్రకటన చేశారు. ప్రస్తుతానికి సమ్మె ఆపడం లేదని, యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. కోర్టు తీర్పును పరిశీలించి న్యాయ నిపుణుల సలహా తీసుకున్నాక ఒకటి రెండ్రోజుల్లో తమ తుది నిర్ణయం చెబుతామని తెలిపారాయన.

మంగళవారం ఉదయం నుంచి జేఏసీలోని అన్ని యూనియన్ల సెంట్రల్ కమిటీలు హైదరాబాద్‌లో సమావేశమయ్యాయి. వేర్వేరుగా ఆ కమిటీలు అన్నీ చర్చించాయి. సాయంత్రం తర్వాత యూనియన్ల లీడర్లు భేటీ అయ్యారు. ఈ సమావేశం వివరాలను జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మీడియాకు తెలిపారు. ప్రస్తుతానికి సమ్మె కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అన్ని యూనియన్లు చర్చించి, సమ్మెపై జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పాయని అన్నారు.

ఒత్తిడి లేదు

హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ తమకు ఇంకా అందలేదని, రేపు (బుధవారం) తమ చేతికి అందొచ్చని అన్నారు అశ్వత్థామ రెడ్డి. తీర్పు కాపీ వచ్చిన తర్వాత పరిశీలించి, లాయర్లు, న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత మరోసారి సమావేశమై సమ్మెపై తుది నిర్ణయం వెల్లడిస్తామని అన్నారు. అయితే ‘సమ్మె విరమించాలని కార్మికుల నుంచి మీపై ఒత్తిడి వస్తోందా?’ అని అడగ్గా, అలాంటిదేమీ లేదని చెప్పారు అశ్వత్థామరెడ్డి.