
హైదరాబాద్, వెలుగు: సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, 7 నుంచి 14 దాకా ఈ సర్వీసులు నడుస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. 11 నుంచి 14 దాకా ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. సాధారణ చార్జీలే వర్తిస్తాయన్నారు. గురువారం బస్ భవన్ లో ఆర్టీసీ అధికారులు, ఆర్ఎంలు, డీవీఎంలతో ఆన్ లైన్ రివ్యూ చేపట్టారు. ఎక్కువ చార్జీలు చెల్లించి ప్రైవేట్ బస్సుల్లో జర్నీ చేయొద్దని ప్యాసింజర్లకు సూచించారు.
గతేడాది కంటే ఈ ఏడాది రెవెన్యూ ఎక్కువ సాధించాలని సూచించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో డిపో మేనేజర్, ఆపై అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్ణణాలకు ప్రత్యేక సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంజీబీఎస్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. రాను పోను ఒకేసారి టికెట్ బుక్ చేసుకున్న ప్యాసింజర్లకు రిటర్న్ జర్నీపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామన్నారు.