
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసి బస్ డిపో వద్ద అద్దెబస్సుల యజమానులు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. డిపో మేనేజర్ వైఖరిపై నిరసన తెలిపారు. డిపో మేనేజర్ కార్గో పార్సిల్లో వచ్చిన లగేజిని తమతో మోయిస్తన్నారని, డ్యూటీల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రైవేట్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ డ్రైవర్లను చులకనగా చూస్తు చిన్నచూపుగా మాట్లాడుతూ మానసికంగా హింసించడాన్ని డిపో మేనేజర్, అధికారులు మానుకోవాలని వారు కోరారు. ఆర్టీసీ రెగ్యులర్ డ్రైవర్లకు సమానంగా ప్రైవేట్ డ్రైవర్ల కూడా పని చేస్తున్నారన్నారు. అద్దె బస్సులను రెగ్యులర్ గా నడపకుండా ఆంక్షలు విధించడం, బస్ స్టాండ్ లో కూడా బస్సులను త్వరగా తీయాలంటూ అద్దె బస్సుల డ్రైవర్లను వేధింపులకు గురి చేయడం దారుణమన్నారు. ఇకనైనా డిపో మేనేజర్ మానవతా దృక్పథంతో ఆలోచించకపోతే ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తామన్నారు. ప్రైవేట్ డ్రైవర్ల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపే మల్లేష్ హెచ్చరించారు.