
రేగొండ, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మారుమూల గ్రామాలకు సైతం రవాణా సౌకర్యం కల్పించి ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరిస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లాలోని రేగొండ మండలం జూబ్లీనగర్లో ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే ఆర్టీసీ డీఎంతో కలిసి జూబ్లీనగర్ నుంచి భీమ్ నగర్ తండా మీదుగా కొత్తపల్లి(బీ) వరకు బస్సులో ప్రయాణం చేశారు. కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చివరి ఆయకట్ట వరకు నీరు అందిస్తాం
శాయంపేట : చలివాగు ప్రాజెక్టు చివరి ఆయకట్ట వరకు సాగు నీరు అందిస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని జోగంపల్లి శివారు చలివాగు ప్రాజెక్టు నుంచి ఆయకట్ట పంటలకు ఎమ్మెల్యే నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ ప్రసాద్, డీఈఈ గిరిధర్, ఏఈ అమృత్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.