- 141 మంది పురుషులు, 55 మంది మహిళలు సెలెక్ట్
- 13 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్స్
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 198 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (టీఎస్టీ), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (ఎంఎస్టీ) పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయ్యింది. 84 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు 62 మంది పురుషులు, 22 మంది మహిళలు సెలెక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే 114 మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు 79 మంది పురుషులు, 33 మంది మహిళలతో కలిపి 112 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను టీజీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
గతేడాది డిసెంబర్ 25న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం రాత పరీక్షలు నిర్వహించామని తెలిపారు. పరీక్షల్లో సెలెక్ట్ అయినవారికి ఏప్రిల్ 16, 17 తేదీల్లో అంబర్‌పేటలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడం వల్ల మెకానికల్ విభాగంలో రెండు పోస్టులు భర్తీ కాలేదని స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థుల రిజిస్ట్రేషన్ నంబర్లు, పేర్లు, కటాఫ్ మార్కుల వివరాలను బోర్డు వెబ్‌సైట్ www.tgprb.in లో పొందుపర్చినట్లు వివరించారు.
ఎంపికైన అభ్యర్థులు ఇలా చేయాలి..
ఎంపికైన అభ్యర్థులు మే 13న ఉదయం 8 గంటల నుంచి 16న అర్ధరాత్రి వరకు వెబ్‌సైట్‌లోని తమ లాగిన్ ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారాన్ని పూర్తి చేయాలి. డిజిటల్‌గా నింపిన ఈ ఫారాలను మూడు సెట్ల ప్రింట్లు తీసుకుని, తమ సంతకంతోపాటు గెజిటెడ్ అధికారి చేత అటెస్టేషన్ చేయించాలి. ఈ మూడు సెట్ల అటెస్టేషన్ ఫారాలను, సర్టిఫికెట్లతో కలిపి మే 20న తమకు కేటాయించిన ప్రాంతాల్లో నేరుగా అందజేయాలి.
