రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరింది. కార్మికుల డిమాండ్లపై సర్కార్ దిగిరాకపోవడంతో సమ్మెను ఉదృతం చేయాలని నిర్ణయించారు కార్మికులు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ బస్సు డిపోల ఎదుట ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు చేయాలని ఆర్టీసీ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. దీంతో డిపోల ఎదుట కార్మికులు ఆందోళన చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేవరకు వెనక్కి తగ్గే ప్రసక్తిలేదని సవాల్ విసురుతున్నారు.
అయితే ఈ సమ్మెపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేసేది లేదని స్పష్టం చేశారు. సంవత్సరానికి రూ.1200 కోట్ల నష్టం, రూ.5వేల కోట్ల రుణ భారంతో ఆర్టీసీ నష్టాల్లో ఉంటే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం ఎంతవరకు సమంజసమన్నారు. సగటున ఆర్టీసీ సిబ్బందికి నెలకు రూ.50 వేల జీతం వస్తున్నా ఇంకా పెంచమని అడగడంలో అర్థంలేదన్నారు. కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వ తలొగ్గేది లేదని, డెడ్ లైన్ లోపుల కార్మికులు విధులకు హాజరుకావాలని లేదని వారిని తిరిగి విధుల్లోకి తీసుకోబోమని హెచ్చరించారు.
అయితే సమీక్షలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆర్టీసీ కార్మికులు బగ్గుమంటున్నారు. ఆరో రోజు సమ్మె సందర్భంగా కార్మికులు తమకు చెల్లించే జీతాల పేస్లిప్ లతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసన సందర్భంగా వీ6తో మాట్లాడిన ఓ మహిళా కార్మికురాలు కేసీఆర్ పై మండిపడ్డారు. కేసీఆర్ కార్మికులకు రూ.50వేలు ఇస్తున్నారని ప్రకటించడంపై స్పందించిన ఆమె తమకు రూ.50వేలు ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
సకలజనుల సమ్మె సందర్భంగా ఆర్టీసీ తరుపున తాము సమ్మె చేసినట్లు గుర్తు చేశారు. సమ్మెలో భాగంగా కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల కాళ్లకి ముళ్లు గుచ్చుకోకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు. కానీ ఆమాట నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీలం చేస్తామని మాట తప్పారని సూచించారు.
అతిచిన్న వయస్కుడైన ఏపీ సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. కానీ కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోగా విధుల నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల్ని తొలగించడం కేసీఆర్ తరం కాదని, కార్మికుల్ని తొలగించి కేసీఆర్ ఆర్టీసీని కుమారుడు, కుమార్తె , అల్లుడుకు రాసిస్తారా అని విమర్శించారు. అలా రాసిస్తామని ముఖ్యమంత్రి చెబితే విధుల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని సవాల్ విసిరారు.
