ఆర్టీసీ కార్మికుల రాజ్​భవన్ ముట్టడి .. ఇబ్బందులుపడ్డ గురుకుల ఎగ్జామ్ అభ్యర్థులు

ఆర్టీసీ కార్మికుల రాజ్​భవన్ ముట్టడి .. ఇబ్బందులుపడ్డ గురుకుల ఎగ్జామ్ అభ్యర్థులు
  • విలీన బిల్లును గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ 
  • యూనియన్ల నేతలతో వర్చువల్​గా మాట్లాడిన తమిళిసై 
  • రాష్ట్రవ్యాప్తంగా రెండు గంటలు బస్సులు బంద్ 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ కార్మికులు శనివారం రాజ్ భవన్ ను ముట్టడించారు. వివిధ డిపోల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్మికులు.. నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ కు ర్యాలీగా వెళ్లారు. అక్కడ బైఠాయించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాలని నినాదాలు చేశారు. అంతకుముందు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్ చేశారు. కార్మికులు ఎక్కడికక్కడ డిపోల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాగా, హైదరాబాద్ లో ఉదయం 11 గంటల వరకు బస్సులు నడవలేదు. దీంతో గురుకుల ఎగ్జామ్ అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్ బీ నగర్ తదితర బస్టాండ్లలో వేలాది మంది ప్యాసింజర్లు బస్సుల కోసం వేచి చూశారు. 

బిల్లును ఆపే ఉద్దేశం లేదు: గవర్నర్ 

ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ ను ముట్టడించగా, యూనియన్ల నేతలతో గవర్నర్ తమిళిసై పుదుచ్చేరి నుంచి వర్చువల్ గా మాట్లాడారు. బిల్లుపై తనకున్న అభ్యంతరాలను వివరించారు. ‘‘ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేసే ఉద్దేశం నాకు లేదు. మీరు రాజ్ భవన్ ను మట్టడించినందుకు నాకు బాధ లేదు. నేను కార్మికుల సంక్షేమం, భద్రత గురించే ఆలోచిస్తున్నాను. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ప్రభుత్వాన్ని కొన్ని అంశాలపై వివరణ కోరాను. వాటిపై మీరు కూడా ప్రభుత్వాన్ని అడిగి, వివరణ కోరండి. నేను రాష్ట్రపతి పర్యటన కారణంగా పుదుచ్చేరికి వచ్చాను” అని గవర్నర్ చెప్పారు. ఈ మీటింగ్ లో టీఎంయూ అధ్యక్ష, ప్రధాన  కార్యదర్శులు ఏఆర్ రెడ్డి, థామస్ రెడ్డి, కమలాకర్ గౌడ్, యాదయ్య, బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు యాదవ్, జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి, హనుమంతు ముదిరాజ్ పాల్గొన్నారు. 

మమ్మల్ని పిలవలే: రాజిరెడ్డి 

గవర్నర్​తో మీటింగ్​కు తమను పిలవలేదని మరో జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి తెలిపారు. ‘‘పోలీసులు మీటింగ్ ఉందని రాజ్ భవన్ లోపలికి అనుమతించారు. కానీ బయటే అరగంట వెయిట్ చేయించారు. తర్వాత లిస్ట్ లో నా పేరు లేదని చెప్పారు. యూనియన్ లీడర్లు అందరినీ పిలవకుండా, కొంతమందినే పిలవడం కరెక్ట్​ కాదు” అని ఆయన అన్నారు.

గవర్నర్ అభ్యంతరాలు కరెక్టే: థామస్ రెడ్డి

ఆర్టీసీ విలీన బిల్లుపై గవర్నర్ చెప్పిన అభ్యంతరాలు కరెక్టే అని టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి తెలిపారు. గవర్నర్ లేవనెత్తిన అంశాలన్నీ కార్మికులకు సంబంధించినవే ఉన్నాయని చెప్పారు. బిల్లులో ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగాలని గవర్నర్ ను కోరామని పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మంచి నిర్ణయమని గవర్నర్ అన్నారు. ప్రభుత్వం నుంచి వివరణ రాగానే బిల్లుకు ఆమోదం తెలుపుతానని చెప్పారు” అని థామస్ రెడ్డి వెల్లడించారు.  

ప్రభుత్వమే బంద్ చేయాలని చెప్పింది: అశ్వత్థామరెడ్డి 

ఆర్టీసీ బంద్ వెనుక ప్రభుత్వం ఉందని, అధికారులే బస్సులు బంద్ చేయాలని ఆదేశించారని జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. “ ప్రభుత్వం కార్మికులను అడ్డుపెట్టుకుని గవర్నర్ మీద విమర్శలు చేసింది. గవర్నర్ లేవనెత్తిన అంశాలన్నీ కార్మికులకు సంబంధించినవే ఉన్నాయి. పీఆర్సీల పెండింగ్, ఇతర బకాయిలపై తనకు ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని గవర్నర్ చెప్పారు. భవిష్యత్తులో కార్మికులకు ఇబ్బందులు రావొద్దనే ప్రభుత్వాన్ని వివరణ కోరానని తెలిపారు” అని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు.