తెలంగాణలో 17 వేల కేసులు పెండింగ్‌‌ : ఆర్టీఐ కమిషనర్‌‌ పీవీ.శ్రీనివాసరావు

తెలంగాణలో 17 వేల కేసులు పెండింగ్‌‌ : ఆర్టీఐ కమిషనర్‌‌ పీవీ.శ్రీనివాసరావు

గద్వాల/అలంపూర్‌‌, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల ఆర్టీఐ కేసులు పెండింగ్‌‌లో ఉన్నాయని, వీటిని త్వరగా పరిష్కరించేందుకే జిల్లాల పర్యటనలు చేస్తున్నట్లు ఆర్టీఐ కమిషనర్‌‌ పీవీ.శ్రీనివాసరావు చెప్పారు. గద్వాల కలెక్టరేట్‌‌లో గురువారం జరిగిందిన అవగాహన సదస్సుకు కమిషనర్లు దేశాల భూపాల్, వైష్ణవి మేర్ల, కలెక్టర్ సంతోశ్‌‌, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసిహ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా కమిషనర్‌‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఆఫీస్‌‌లో తప్పనిసరిగా సిటిజన్‌‌ చార్ట్‌‌ను ప్రదర్శించాలని సూచించారు. సమాచార హక్కు చట్టాన్ని పగడ్బందీగా అమలు చేస్తే అవినీతి కూడా తగ్గుతుందన్నారు. ఇప్పటివరకు ఎనిమిది జిల్లాల్లో పర్యటించి పలు కేసులను అక్కడికక్కడే పరిష్కరించినట్లు చెప్పారు. చట్టాన్ని ప్రజలు దుర్వినియోగం చేయొద్దని సూచించారు. అనంతరం పలు సందేహాలను నివృత్తి చేశారు. సదస్సులో అడిషనల్‌‌ కలెక్టర్‌‌ లక్ష్మీనారాయణ, ఆర్డీవో అలివేలు పాల్గొన్నారు. అంతకుముందు ఆర్టీఐ కమిషనర్లు అలంపూర్‌‌ జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి రాగా వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గణపతి పూజ, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. తర్వాత అర్చకులు ఆశీర్వచనం చేసి, శేషవస్త్రాలు అందజేశారు.