ఇక శత్రువులకు చుక్కలే.. ఆర్మీలో రుద్ర బ్రిగేడ్, భైరవ్ బెటాలియన్ ప్రారంభం

ఇక శత్రువులకు చుక్కలే.. ఆర్మీలో రుద్ర బ్రిగేడ్, భైరవ్ బెటాలియన్ ప్రారంభం

ఇండియన్ ఆర్మీ మరింత శక్తివంతంగా మారబోతోంది. బార్డర్ లో ఎలాంటి కవ్వింపులకు పాల్పడినా వెంటనే రియాక్షన్ ఉండేలా ప్రత్యేక బలగాలను రూపొందించింది ఆర్మీ. అదే విధంగా వివిధ ఆయుధాలతో పనిచేసే బలగాలను ఒక గ్రూప్ కిందకు తీసుకువస్తూ మరింత పవర్ ఫుల్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆర్మీ చీఫ్  ఉపేంద్ర ద్వివేది. శనివారం (జులై 26) కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించిన ఆర్మీ చీఫ్.. రుద్ర అనే ఆల్ ఆర్మ్డ్ బ్రిగేడ్ ను ఏర్పాటు చేశారు. అదే విధంగా బార్డర్ లో క్విక్ యాక్షన్ కింద పనిచేసే భైరవ్ అనే కమాండో బెటాలియన్ ను ఏర్పాటు చేశారు. 

దీంతో శత్రు దేశాల ఆట కట్టించేందుకు మన ఆర్మీలో ఒక శక్తిమంతమైన దళం ఏర్పాటైంది. ప్రస్తుత సవాళ్లు, భవిష్యతుప్పులను ఎదుర్కొనేలా ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పదాతిదళం, యాంత్రిక పదాతిదళం, సాయుధ యూనిట్ల ఫిరంగిదళం, ప్రత్యేకదళాలు, డ్రోన్ , మానవ రహిత వైమానిక వ్యవస్థలతో రుద్ర బ్రిగేడ్ ను ఏర్పాటు చేశారు. 

అలాగే సరిహద్దు లోని శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేందుకు 'భైరవ్' అనే లైట్ కమాండో బెటాలియన్ యూనిట్లను కూడా తయారుచేశామని వెల్లడించారు.